వైసీపీలో ఇద్దరు కీలక నేతలు జంప్

అనంతపురం జిల్లాలో వైసీపీ జరిపిన యువభేరి విజయవంతమైందనే చెప్పాలి. అయితే అదే సమయంలో పార్టీలో ఉన్న లుకలుకలు కూడా బయటపడ్డాయి. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి హాజరైన యువభేరికి ఇద్దరు కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లాలో కొందరు పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారం నిజమవుతుందేమోననిపిస్తోంది. సాక్షాత్తూ పార్టీ అధినేత హాజరైన కార్యక్రమానికి ఈ ఇద్దరు నేతలు హాజరుకాకపోవడం పార్టీలోనూ, జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అనంతపురంలో జరిగిన యువభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. వాస్తవానికి వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ జిల్లాకు వచ్చినప్పుడు వీరిద్దరితో మాట్లాడి సర్దుబాటు చేస్తారని పార్టీ నేతలు భావించారు. కాని వారిద్దరూ మొఖం చాటేయడంతో వారు పార్టీని వీడక తప్పదనిపిస్తోంది.
జగన్ సభకు డుమ్మా కొట్టడంతో......
అనంతపురం నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని వైసీపీ అధిష్టానం తొలగించింది. ఆయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. గురునాధరెడ్డి స్థానంలో మైనారిటీ నేత అహ్మద్ నదీమ్ ను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించింది. దీంతో గురునాధరెడ్డి కలత చెందారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న సందేహంతో ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా గురునాధరెడ్డి దూరంగా ఉంటున్నారు. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. వైఎస్ మరణానంతరం కూడా ఆయన జగన్ వెంటే నడిచారు. గురునాధరెడ్డి కేవలం తనకు పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదనే పార్టీని వీడనున్నారు. గురునాధరెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి రావడానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక జిల్లాలో ఉన్న ఒకే ఒక వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఈయన ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి గెలవడానికి ఆయన సోదరుడు మధుసూదనరెడ్డి ప్రధానకారణమనిచెప్పక తప్పదు. మధుసూదన్ రెడ్డి తన సోదరుడి గెలుపుకు కృషిచేశారు. అయితే సోదరుడికి విశ్వేశ్వర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గించడంతో మధుసూదన్ రెడ్డి కూడా పార్టీని వీడుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్రోద్బలంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యనేతలు జగన్ సభకు డుమ్మా కొట్టడంతో వాళ్లు పార్టీని వీడటం ఖాయమని తేలిపోయంది.
- Tags
- వైసీపీ

