వైసీపీపై బురద చల్లే ప్రయత్నమేనా?

వైసీపీపై వీలయనంత మేరకు బురద జల్లే కార్యక్రమాన్ని చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పార్టీలు మారుతున్నారని ఒకసారి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పినట్లు మరోసారి ఇలా వైసీపీ క్యాడర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు టీడీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రయత్నిస్తుందని, వాటిని ఎవరూ నమ్మవద్దని వైసీపీ నేతలు కోరుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎమ్మెల్యేలు పార్టీని వీడతారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆ ఎమ్మెల్యేలే ఖండిస్తున్నారు. తాము వైసీపీని వీడేది లేదని చెబుతున్నారు. అయినా ఇంకా పార్టీ నుంచి వీడతారన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇది టీడీపీ అనుకూల మీడియా పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి జిమ్మిక్కులతో పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని అంటున్నారు.
బూచేపల్లి ఎందుకు పోటీ చేయరు?
అలాగే ప్రకాశం జిల్లా దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని జగన్ తో చెప్పారని, జగన్ కూడా బూచేపల్లికి ప్రత్యామ్నాయం చూడమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాసులు రెడ్డికి చెప్పినట్లు ప్రచారం జోరుగా జరిగింది. అయితే బూచేపల్లి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైఎస్ కుటుంబం, నవరత్నాల సభలను దర్శి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న బూచేపల్లి కుటుంబం ఎందుకు అర్ధాంతరంగా రాజీకీయాల నుంచి మానుకుంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. బూచేపల్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారన్న వార్తలను చూసి ఆయన వద్దకు అభిమానులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. వారికి అసలు విషయం చెప్పలేక బూచేపల్లి అవస్థలు పడుతున్నారు. అయితే తన నియోజకవర్గంలో కొందరిని పార్టీ నేతలు చేరదీస్తున్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లానని బూచేపల్లి శివప్రసాద్ చెప్పారు. మొత్తం మీద యువకుడైన బూచేపల్లి శివప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం సత్యదూరమంటున్నారు ఆయన అనుచరులు.
- Tags
- వైసీపీ

