వైసీపీకి మంచి రోజులొస్తున్నాయా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలోనే చేరికలు షురూ అవుతున్నాయి. పాదయాత్ర ప్రారంభించి నేటికి 16రోజులు. దాదాపు 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో వలసలు కూడా అదే రీతిలో సాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి నేతలు వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తుండటంతో ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దొమ్మేటి వెంకటేశ్వర్లు తాళ్లరేవు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం తాళ్లరేవు నియోజకవర్గం లేదు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా తాళ్లరేవు నియోజకవర్గం కొంత కాకినాడ రూరల్ లోనూ, మరికొంత రామచంద్రాపురం నియోజకవర్గంలోనూ కలిసి పోయింది. అయినా దొమ్మేటి గట్టి పట్టున్న నేత కావడంతో ఆయన చేరికతో అతి పెద్ద జిల్లాలో బలం చేకూరుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
చేరికలతో ఉత్సాహం...
ఇక పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పార్టీలోకి చేరుతూనే ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు అనేకమంది నేతలు వైసీపీలో చేరారు. భూమా అనుచరుడు, మాజీ మార్కెటింగ్ యార్డు ఛైర్మన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక బనగానపల్లెలోనూ టీడీపీ జిల్లా వైద్యవిభాగం అధ్యక్షుడు రామిరెడ్డి వైసీపీలోకి చేరిపోయారు. ఆ నియోజకవర్గంలో రామిరెడ్డికి మంచి పేరుంది. ఇలా వరుసగా పాదయాత్రలో నేతలు చేరుతుండటంతో వైసీపీ నేతలు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. జగన్ పాదయాత్రలోనే చేరాలని చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ పార్టీలో మరికొందరు నేతలు చేరే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద వరుస చేరికలతో జగన్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది.
- Tags
- వైసీపీ

