వైసీపీకి టీడీపీ వరుస షాక్ లు..క్యూలో మరో నలుగురు ఎమ్మెల్యేలు

జగన్ పాదయాత్రను మానసికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. జగన్ పాదయాత్రకు ముందే టీడీపీ గేమ్ స్టార్ట్ చేసింది. వైసీపీ నుంచి వీలయినంతమందిని పాదయాత్ర సమయంలో తీసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహానికి పార్టీనేతలు అదేపనిగా పదునుపెడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వంతల రాజేశ్వరిని మంత్రి చినరాజప్ప, యనమలలు పార్టీ మార్పిడికి తీవ్రంగానే శ్రమించారు. మరోవైపు వైసీపీ చేసిన కొన్ని తప్పిదాలు కూడా ఎమ్మెల్యే రాజేశ్వరి పార్టీని వీడటానికి కారణాలుగా చెప్పొచ్చు. రంపచోడవరం నియోజకవర్గానికి వైసీపీ మరో ఇన్ ఛార్జిని వైసీపీ అధినేత జగన్ నియమించడంతో ఎమ్మెల్యే రాజేశ్వరి అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీని వీడి అధికార టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
మరికొందరి జాబితా రెడీ......
రాజేశ్వరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు, కడప, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నేతలు కూడా కొందరు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వారికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే విడతల వారీగా వారిని పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జగన్ పాదయాత్ర జరిగే సమయంలోనే నేతలు ఆ పార్టీలో నుంచి వస్తుంటే... ఆ పార్టీపై ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లుతుందన్నది టీడీపీ ప్లాన్. పక్కా వ్యూహం ప్రకారమే చంద్రబాబు జగన్ పాదయాత్ర ఫోర్సు ను తగ్గించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే విడతల వారీగా పసుపు కండువా కప్పుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది టీడీపీకి లాభమా? నష్టమా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.
- Tags
- టీడీపీ వైసీపీ

