వైసీపీకి ఇదే జరిగితే కష్టమే మరి....!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గడ్డుపరిస్థితిని ఎదుర్కోబోతోంది. ఏపీలోని 13 జిల్లాల్లో ఓట్ల తొలగింపు కార్యక్రమంలో వైసీపీని దెబ్బతీసే వ్యూహం ఉందని వైసీపీ నేతలు చాలా ఆలస్యంగా గమనించినట్లుతన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బతీసేందుకే ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా అధికార పార్టీ మలచుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ఓట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభమయింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా స్థానికంగా లేని వారి ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే బోగస్ ఓటర్ల పేరిట తమ ఓట్లను తొలగిస్తున్నారని వైసీపీ నేతలు ఆలస్యంగా గ్రహించారు.
ఓట్ల తొలగింపులో....
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. టగ్ ఆఫ్ వార్ గా జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరునూ ప్రసన్నం చేసుకోవడానికి మల్లగుల్లాలు పడుతుంటారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ ఆలస్యంగానే తమ ఓట్లు తొలిగించారని గ్రహించి ఆందోళనకు దిగింది. చివరకు అధికారులు ఆ ఓట్లను జాబితాలో చేర్చారు.ఇక సాధారణ ఎన్నికల విషయంలో అలా ఉండదు. అయితే ఇప్పుడే మేల్కొన్న వైసీపీ నేతలు ఓట్ల తొలగింపుపై ఆందోళనకు దిగుతున్నారు. 13 జిల్లాల్లో ఓట్ల తొలగింపు కార్యక్రమం వైసీపీలో ప్రకంపనలు రేపింది.
సీనియర్ నేతల కుటుంబంలో కూడా...
స్వయంగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల పేర్లే ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆయన ఖిన్నుడయ్యారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను ప్రతి నియోజకవర్గంలో పరిశీలించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల తొలగింపు కార్యక్రమం ఉంటే ఏం చేస్తున్నారని కొందరు నేతలను నిలదీశారు కూడా. ఇంట్లో లేని సమయంలో వచ్చి తమ పేర్లను జాబితా నుంచి తొలగించారని పలువురు నేతలు వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లే ఎక్కువగా గల్లంతయ్యాయని వివిధ జిల్లాల నుంచి జగన్ కు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీనిపై 13 జిల్లాల్లో వైసీపీ ఆందోళనకు దిగాలని వైసీపీ నిర్ణయించింది.
13 జిల్లాలకు జగన్ అలెర్ట్.....
2014 ఎన్నికలను చూసైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేతలకు జగన్ ఉపదేశించారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం ఐదులక్షలు మాత్రమే. కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయింది. నెగ్గింది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయడానికి జగన్ పాదయాత్ర చేస్తుంటే ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం వైసీపీకి ఇబ్బందిగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పోరాటం చేస్తోంది. అందుకోసమే 175 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించి ఒకవేళ తొలగించి ఉంటే వెంటనే చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా నేతలకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తం మీద ఓట్ల తొలగింపు కార్యక్రమంతో వైసీపీలో కొంత గందరగోళం నెలకొందనే చెప్పాలి.

