వైసీపీ బలంగా ఉందన్న బీజేపీ

వైసీపీ బలంగా ఉందని బీజేపీ నేతలు కొందరు అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది. టీడీపీ, బీజేపీ తెగదెంపులు తుది దశకు చేరుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి కేంద్రప్రభుత్వం నుంచి తప్పుకున్న టీడీపీ, త్వరలోనే ఎన్డీఏ నుంచి తప్పుకుంటుందన్న విషయం దాదాపుగా అందరికీ అర్థమయింది. పైకి తాము ఎన్డీఏలో ఉన్నామని చెబుతున్నప్పటికీ పొత్తుకు కటీఫ్ చెప్పే ఉద్దేశంతోనే టీడీపీ ఉంది.
బీజేపీ వల్ల లాభంలేదని....
ీఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఆదేశం మేరకు పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునేందుకు బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తి కర సంభాషణ చోటు చేసుకుంది. ఇటీవలే చంద్రబాబు పార్టీ సమావేశంలో బీజేపీ పొత్తు వల్ల తమకు ప్రత్యేకంగా వచ్చిన ప్రయోజనమేమీ లేదని, 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ సొంతంగా సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. సాధారణ ఎన్నికల్లో కూడా అన్నే ఓట్లు రావడం వల్ల బీజేపీతో కొత్త వచ్చి పడిన ఓట్లేవీ లేవని చంద్రబాబు విశ్లేషించారు.
అధికార పార్టీపై అసంతృప్తి.....
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా కొంత స్వరం పెంచారు. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఓట్ల శాతం కూడా చూసుకోవాలని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పమేనని, జగన్ పాదయాత్రతో వైసీపీ ఈ మధ్య కాలంలో బలం పుంజుకుందని బీజేపీ నేతల్లో కొందరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా బాగానే ఉందని కొందరు ఈ సందర్భంగా అన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల లాభం లేదని చంద్రబాబు అనడంపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల సమయంలో పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని, తొలుత ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాత్రం బీజేపీ నేతలు నిర్ణయించారు. టీడీపీ మోడీపైన, కేంద్ర ప్రభుత్వంపైన చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని నిశ్చయించారు.
