వైసీపీ నేతలు ఇలా ఎందుకు చేస్తున్నారు?

వైసీపీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు ముందు లండన్ వెళ్లిన జగన్ తిరిగి వచ్చిన తర్వాత ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తన పాదయాత్ర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి తీసుకోవాలా? వద్దా? అన్న అంశం ఈసందర్బంగా చర్చకు వచ్చింది. కొందరు పాదయాత్రకు అనుమతి వద్దని చెప్పగా, తీసుకుంటే పోలా? అని కొందరు చెప్పారు. అయితే వైఎస్ జగన్ మాత్రం అనుమతి తీసుకోనవసరం లేదని, డీజీపీకి భద్రత కల్పించాల్సిందిగా లేఖ రాస్తే సరిపోతుందని చెప్పారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు పాదయాత్రకు అనుమతి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.
నేతల మధ్య సమన్వయ లోపం.....
కాని సమావేశం నుంచి బయటకు వచ్చిన వైసీపీ నేత రోజా పాదయాత్రకు పర్మిషన్ తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ అనుమతి తీసుకుంటారని రోజా మీడియాకు చెప్పడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. వైసీపీ అధినేత జగన్ కూడా కొంత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి తీసుకుంటామని మీకుచెప్పామా? అని రోజాను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో రోజా అన్ని ఛానళ్లకు ఫోన్లు చేసి బ్రేకింగ్ లను తొలగించాలని రిక్వెస్ట్ చేశారు. వైసీపీ నేతల్లో సమన్వయం లేదనడానికి ఇదే ఉదాహరణగా చెబుతున్నారు. సమావేశాల్లో పిచ్చాపాటీగా మాట్లాడుకున్న మాటలను మీడియాకు చేరవేయడం ఇది కొత్తేమీ కాదని, కొంత అర్థం చేసుకుని మాట్లాడాలని జగన్ నేతలకు సూచించారు. మొత్తం మీద జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ నేతల్లో సమన్వయం కొరవడటం, ఇక పాదయాత్ర ప్రారంభమైన తర్వాత నేతల మధ్య కో-ఆర్డినేషన్ లేకుంటే కష్టమేనంటున్నారు సీనియర్ నేతలు.
- Tags
- వైసీపీ

