వైసీపీ కొత్త పంథాలో... సరికొత్త విధానాలతో....?

సాధారణ మీడియా మీద వైసీపీ అధినేత జగన్ ఆధారపడటం లేదు. సోషల్ మీడియానే ఆయన ఎక్కువగా నమ్ముకున్నట్లుంది. వాస్తవాలను, పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలంటే సోషల్ మీడియాను వైసీపీ ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు జగన్ పాదయాత్ర విశేషాలను చేరవేస్తూ వస్తుంది. నవంబరు 6వ తేదీన ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్ర 56 రోజులు గడిచాయి. అలాగే దాదాపు 766 కిలోమీటర్లు జగన్ నడిచారు. అయినా పాదయాత్రకు మీడియా ఎక్కువగా ప్రచారం కల్పించడం లేదన్నది వైసీపీ అభిప్రాయం.
కొత్త యాప్ అందుబాటులోకి....
దీంతో తాజాగా మరో యాప్ ను వైసీపీ సోషల్ మీడియా విభాగం అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా జగన్ పాదయాత్ర కోసమే ఈ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ కు వాక్ విత్ జగన్ అని పేరు పెట్టారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే జగన్ ప్రజాసంకల్ప యాత్రతో పాటుగా ప్రతిరోజూ వైఎస్ జగన్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు? మనం ఎన్ని అడుగులు జగన్ తో వేశామో తెలిసిపోతుంది. అంతేకాదు పాదయాత్రకు సంబంధించిన ఇతర విషయాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మనం నడిచిన దూరాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు.
నేడు పూతలపట్టులో.....
ఈరోజు జగన్ పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లి క్రాస్ రోడ్స్ నుంచి ఈరోజు జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు తలుపులపల్లి గ్రామం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత తిమ్మిరెడ్డిపల్లి, తోటలోపు, టీరంగంపేట మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం రంగంపేట క్రాస్ రోడ్స్, పూతలపట్టు చేరుకుంటారు. పూతలపట్టులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆదివారం జగన్ 14.2 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు.
- Tags
- వైసీపీ

