వైసీపీ ఎంపీ రేణుక సైకలెక్కేస్తున్నారోచ్

వైసీపీ ఎంపీ బుట్టారేణుక పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఆమె సంకేతాలు అందించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా రేణుక కలసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్, తన నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులను గురించి ఆమె చంద్రబాబుతో చర్చించారు. చంద్రబాబు కూడా రేణుకకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో రేణుక టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. వాస్తవానికి రేణుక ఎప్పుడో పార్టీ మారాల్సి ఉంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ మారినప్పుడే రేణుకకూడా పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. రేణుక భర్త నీలకంఠం అప్పుడు టీడీపీలో చేరినా... రేణుక మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు.
పాదయాత్ర ప్రారంభమైన తర్వాతే....
ఇటీవల కర్నూలు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోనూ రేణుక చర్చలు జరిపారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల కోసమే తాను లోకేష్ ను కలిశానని ఆమె మీడియాతో చెప్పారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ లో కర్నూలు జల్లా నేతలతో సమావేశం అయినప్పుడు కూడా హాజరయ్యారు. పాదయాత్రపై 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జుల సమావేశానికి రేణుక వచ్చారు. కాని ఆమె పార్టీ మారడం లేదని అనేకసార్లు మీడియాకు చెప్పారు. కాని జగన్ పాదయాత్ర ప్రారంభమైన సమయంలో పార్టీని వీడి రావాలని టీడీపీ నుంచి రేణుకకు ఆదేశాలందినట్లు తెలిసింది. పాదయాత్రపై నెగిటివ్ ఎఫెక్ట్ పడేందుకు జగన్ యాత్ర ప్రారంభించగానే రేణుక పార్టీని వీడి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ పాదయాత్రను వీక్ చేయాలని టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరోసారి తెరతీసిందనే చెప్పాలి. వైసీీపీ నేతలు మాత్రం ప్రలోభాలకు గురిచేసి రేణుకకు పార్టీ కండువా కప్పబోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీలో మరో ఎంపీ పార్టీని వీడనున్నారు.
- Tags
- బుట్టా రేణుక

