వైభవోపేతంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం

జగద్రక్షకుడిగా భక్తకోటి ఆరాధించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా.. సోమవారం సాయంత్రం మీన లగ్నంలో తిరుమలేశుని ఆలయంలోని ధ్వజస్తంభం మీదికి ధ్వజపటాన్ని అధిరోహింపజేశారు. స్వామివారి వాహనమైన గరుడుడు ఉన్న ధ్వజపటాన్ని ధ్వజస్తంభం మీదికి అధిరోహింపజేయడం విశేషం. ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభం అయినట్లు లెక్క. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో చివరి రోజున ఈ ధ్వజాన్ని అవరోహణం చేయడంతో వేడుకలు ముగుస్తాయి.
ధ్వజారోహణం తర్వాత.. సోమవారం రాత్రి 9 గంటల తరువాత.. తిరుమలేశుని పెద్ద శేష వాహణం కనుల పండుగగా జరిగింది. నాలుగు మాడ వీధుల్లో బారికేడ్లకు ఆవల వేల సంఖ్యలో వేచి ఉన్న జనం.. పెద్ద శేషునిపై ఊరేగుతూ వస్తున్న ఉభయ నాంచార్ల సమేతుడైన మలయప్ప స్వామివారిని దర్శించి తరించారు. పెద్దశేషుని పడగనీడలో సుఖాసీనుడైన భంగిమలో కొలువుదీరిన శ్రీహరి భక్తులను కటాక్షించారు. తిరుమల మాడవీధులు యావత్తూ గోవింద నామ స్మరణలతో ప్రతిధ్వనించాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు వచ్చి, తిరుమల స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శేష వస్త్రాలను బహూకరించి వెళ్లారు.
ఈ కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

