వైకాపా ఒక్క సీటూ గెలవరాదు : బాబు హుకుం

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పరిస్థితిని సృష్టించాలి’’ ఈ నినాదం ఎవ్వరిదో తెలుసా? అక్షరాలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే. మంగళవారం నాడు ఉదయం అమరావతిలో తెలుగదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబునాయుడు.. ఈ మేరకు పార్టీ మంత్రులు, ఇతర కీలక నాయకులకు దిశానిర్దేశం చేశారు. వైకాపాకు అసలు ఒక్క సీటు కూడా దక్కకుండే ఉండేలా, అన్నీ తెలుగుదేశమే గెలుచుకునేలా.. తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రజల్లోకి విసృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ సమన్వయ కమిటీ సమావేశం లో తీర్మానాల గురించి తెలుగుపోస్ట్ డాట్ కామ్ సేకరించిన వివరాల మేరకు వైకాపాకు భవిష్యత్తు లేకుండా చేయడమే తమ పార్టీకి తక్షణ అవసరం అని చంద్రబాబు కర్తవ్యబోధ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల మొదటివారంలో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లోనే ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం గురించి క్లాసులు తీసుకున్నారు. జనచైతన్య యాత్రలు చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలియజెప్పడం పార్టీ బాధ్యత అని అప్పట్లో హితబోధలు చేశారు.
తీరా మంగళవారం సమన్వయ కమిటీ సమావేశంలో కూడా అదే ఎజెండాతో నడిచినట్లుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోని లోపాలను మరింతగా ఎండగట్టాలని వారికి ఠికానా లేని పరిస్థితిని కల్పించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పులివెందుల లో కూడా జగన్ గెలవలేని పరిస్థితి వస్తుందని అన్నారు. ఆ డైలాగుతో సింక్ చేసుకుంటే.. వారికి ఒక్క సీటు దక్కని రీతిలో మన పార్టీ గురించి ప్రజల్లోకి ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు పురమాయించడం విశేషమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

