వేర్పాటువాదుల ’జీహాదీ’కి జైకొడుతున్న ఫరూక్

జమ్మూకాశ్మీర్ రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన పరిణామం. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా స్వయంగా వేర్పాటువాదులకు మద్దతిస్తున్న వైనమిది. ప్రస్తుతం అధికారానికి దూరంగా ఉన్న ఫరూక్ వేర్పాటు వాదులైన హురియత్ నాయకులను ఉద్దేశించి.. ‘స్వాతంత్ర్యం కోసం పోరాటానికి తుదికంటా సాగించాలంటూ’ పిలుపు ఇవ్వడం విశేషం.
తన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు అయిన దివంగత షేక్ మహమద్ అబ్దుల్లా 111వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఫరూక్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీ వేర్పాటు వాదులకు తమ పార్టీ వ్యతిరేకం కానే కాదని ఆయన చెప్పడం విశేషం.
‘‘ముందుకు సాగండి.. మేం మీ వెన్నంటి ఉంటాం.. ఈ ఉద్యమం కోసం మేం మా జీవితాలనే అర్పించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆజాదీ అనే లక్ష్యం సాధించడానికి హురియత్ నాయకులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదంటూ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మనం ఐక్యంగా ఉంటే తప్ప దాన్ని సాధించలేం అంటూ ఆయన చెప్పడం విశేషం.

