వేడెక్కిన హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో ఒక అడుగు ముందులోనే ఉంది. అధికార పక్షం కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇంకా జాబితాపై కసరత్తులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ముందుగానే అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. మొత్తం 68 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అవినీతితో కూరుకుపోయిన కాంగ్రెస్ ను తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలందరూ బెయిల్ పైనే ఉన్నారని చమత్కరించారు.
బీజేపీ ముందస్తు వ్యూహం......
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా కాంగ్రెస్ సింగ్ పైనే నమ్మకం పెట్టుకుంది. ఇక ఎలాగైనా హిమాచల్ ప్రదేశ్ ను ఈసారి చేజిక్కించుకోవాలని కమలనాధులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అంతర్గత విభేదాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలయింది. ఈసారి ఆ తప్పు జరగకుండా ముందుగానే అభ్యర్థుల జాబితాను వడపోత పోసి మరీ ప్రకటించింది. విభేదాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 శాసనసభా నియోజకవర్గాలకు వచ్చే నెల 9వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని స్థానాలకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ మరోసారి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించి ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది గాని సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీరభద్రసింగ్ నే ప్రకటించడం విశేషం.
- Tags
- హిమాచల్ ప్రదేశ్

