వెలగపూడిలో చంద్రబాబు ప్రజాదర్బార్ షురూ

వెలగపూడి సచివాలయంలో చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను ఆలకించడం ప్రారంభించారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి అప్పటికప్పుడు వాటి పరిష్కారానికి సంబంధిత అధికార్లకు ఆదేశాలు ఇవ్వడం సోమవారం ప్రారంభం అయింది. సోమవారం నాడు సాధారణంగా ఉండే పోలవరం ప్రాజెక్టు సమీక్ష, ఇతర అధికారిక కార్యక్రమాల ఒత్తిడి మధ్యలోనూ ఆయన సందర్శకులతో భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా సందర్శకులను కలుసుకుని వారి సమస్యలు విని అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. విదేశీ విద్యారుణం కోసం కొందరు, పింఛన్ల కోసం కొందరు, వివిధ రకాల ఆర్థిక సమస్యలతో వచ్చిన మరికొందరికి తక్షణ సహాయం అందిస్తూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు.
ముంపు బాధితులందరికీ ఒకే రీతిలో పరిహారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధిత రైతులకు ఉభయగోదావరి జిల్లాలో ఒకేరీతిలో పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన భూములు కోల్పోతున్న రైతులు శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసి తమకు పరిహారంగా ఎకరా భూమికి రూ.6లక్షల చొప్పున అందివ్వాలని అభ్యర్ధించారు. ముంపు గ్రామాలన్నింటికీ ఒకే విధమైన పరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
మత్స్యకారులకు మరింత మేలు
జీవన భృతి కోసం భూమికి దూరంగా నడి సముద్రంలో రోజుల తరబడి గడిపే మత్స్యకారులకు అన్నివిధాలుగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. కుటుంబాలను వదిలి ఒక్కోసారి వారాల తరబడి వుండిపోయే మత్స్యకారులకు నిత్యం జీవన పోరాటమేనని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి వారి జీవనవిధానాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ర్టంలోని పదహారు ఉప కులాలు ఒకే తాటిపైకి వచ్చి సమైక్య సంక్షేమ సంఘంగా ఏర్పడిన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. వారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి మత్స్యకారులకు ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసిందని గుర్తుచేశారు.

