వెంకయ్య ఫీలయి ఏం చేశారంటే?

వెంకయ్య నాయుడు రాజ్యసభ సజావుగా జరగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసహనాన్ని కూడా ఫ్లోర్ లీడర్ల ముందు తెలిపారు. రాజ్యసభ గత పన్నెండు రోజులుగా సజావుగా సాగడం లేదు. పెద్దలసభగా పేరున్న రాజ్యసభను సమర్థవంతంగా నడిపించలేకపోతున్నానని వెంకయ్య మనస్తాపం చెందారు. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో వెల్లడించారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
విందును రద్దు చేసి....
రాజ్యసభ సమావేశాల సందర్భంగా వెంకయ్యనాయుడు అందరి సభ్యులకు విందు ఇవ్వాలనుకున్నారు. బుధవారం విందు జరగాల్సి ఉంది. అయితే రాజ్యసభలో జరగుతున్న పరిణామాలను చూసిన వెంకయ్యనాయుడు ఆ విందు ఆలోచనను విరమించుకున్నారు. ఈ విందుకు ఇప్పటికే ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు కూడా సమాచారం పంపారు. అన్ని పార్టీలకు చెందిన నేతలను కూడా ఈ విందుకు పిలుద్దామనుకున్నారు. అయితే గత 12 రోజుల నుంచి రాజ్యసభ సజావుగా జరగకపోవడంతో విందును వెంకయ్య రద్దు చేసుకున్నారు.
వెంకయ్య విందుకు మంచి క్రేజ్....
వెంకయ్య విందు అంటే ఢిల్లీలో మంచి క్రేజ్ ఉంది. షడ్రచులతో కూడిన మెనూ సిద్ధంగా ఉంటుంది. ఆంధ్ర వంటకాలు వెంకయ్య ఇచ్చే విందులో ప్రత్యేకంగా ఉంటాయి. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా వంటవారిని రప్పించి తయారు చేయిస్తారు. చేపలపులుసు, రొయ్యల వేపుడు, మటన్ పులుసు వంటివి ప్రత్యేకంగా నిలుస్తాయి. వెంకయ్య విందు అంటే లొట్టలేసుకుంటూ వెళతారన్న టాక్ కూడా ఉంది. అయితే రాజ్యసభలో జరుగుతున్న పరిస్థితులను చూసి వెంకయ్య తన విందును రద్దు చేసుకున్నారు. వంటవాళ్ల టిక్కెట్లను కూడా రద్దు చేసుకోమని సమాచారం పంపారు. వెంకయ్య ఎంతగా ఫీలయితేనో ఈ నిర్ణయం తీసుకోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
- Tags
- వెంకయ్యనాయుడు
