వెంకన్నకే మోడీ శఠగోపం పెట్టేస్తున్నారే?

తిరుమల తిరుపతి వెంకన్నను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో టీటీడీ పెద్దయెత్తున ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు తిరుమలకు వచ్చే భక్తులపైనా జీఎస్టీ భారం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆధ్యాత్మిక క్షేత్రం. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా సేవాథృక్ఫధంతోనూ పనిచేస్తుంటుంది. దేశ వ్యాప్తంగా టీటీడీ కల్యాణ మండపాలు, దేవాలయాలు నిర్మిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా టెంపుల్ టౌన్ తిరుపతిలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. వేదపాఠశాలలను నిర్వహిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే టీటీడీకి వ్యాట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే జీఎస్టీని మాత్రం వెంకన్న అడ్డుకోలేక పోతున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే... కేంద్రం టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించడం లేదు.
జీఎస్టీ పేరుతో కోట్ల భారం.....
టీటీడీకి 2800 కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో భక్తులకు సౌకర్యాలను కల్పిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం 70 వేల మంది భక్తులు వచ్చిపోతుంటారు. వీరిందరికీ వసతి సౌకర్యంతో పాటు ఉచిత భోజనం, లడ్డూ ప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. లడ్డూ ప్రసాదాలు, అన్నదానానికి అవసరమైన ముడిసరుకులను కొనుగోలు చేయాలంటే జీఎస్టీ భారం పడుతుంది. ఇవన్నీ ఉచితంగానే అందిస్తున్నామని చెబుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. లడ్డూలు కొందరికి ఉచితంగానూ, మరికొన్ని కావాలంటే సబ్సిడి ధరపై అందిస్తుంది. నేయి, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, అన్నదానానికి అవసరమైన ముడిసరుకుల మీద ఏటా వంద కోట్ల రూపాయలు జీఎస్టీ పడుతుందని టీటీడీ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక భక్తులపై కూడా వసతిగృహాల్లోనూ, పరోక్షంగా కొన్నింటిపైనా వందకోట్ల జీఎస్టీ భారం పడుతుందని లెక్క వేసింది. ఈ లెక్కలన్నీ చూపించినా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పక్కన పెట్టేసింది. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత టీటీడీ హుండీలో వచ్చిన దాదాపు 25 కోట్ల రూపాయల పాత నోట్లు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. దానిపై కూడా ఇంతవరకూ స్పష్టత రాలేదు. మొత్తం మీద తిరుమల వెంకన్నపై మోడీసర్కార్ వివక్ష చూపుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
- Tags
- టీటీడీ

