వీళ్లు మారే అవకాశం లేదా?

భారత కమ్యునిస్టు పార్టీలోనూ ఆలోచనలు, ఆచరణల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. సీపీఎం పార్టీలో లుకలుకలు బయలుదేరాయంటున్నారు. అగ్రనేతల మధ్య సమన్వయం కొరవడటంతో అసలే కష్టాల్లో ఉన్న వామపక్ష పార్టీకి నేతల మధ్య అభిప్రాయ భేదాలు మరింత సమస్యలు తెచ్చిపెడుతున్నాయని చెప్పక తప్పదు. సీపీఎంలో ప్రకాశ్ కరత్ చెప్పినట్లే నడుస్తుంది. సీపీఎం జాతీయ కార్యదర్శిగా ఎవరున్నప్పటికీ ప్రకాశ్ కారత్ మాటే ఎక్కువగా నెగ్గుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టాలన్న ప్రస్తుత సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదనను ప్రకాశ్ కారత్ వర్గం తిరస్కరించింది. ఎక్కువమంది సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ప్రకాశ్ కారత్ వెంటే నిలిచారు.
రాజీనామా చేస్తానన్నా....
మరోవైపు ఈ పరిణామాన్ని ఊహించని సీతారాం ఏచూరి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని వెళ్లాలన్నది ఏచూరి ఆలోచన. అయితే ఇందుకు కేంద్ర కమిటీ సభ్యులు అంగీకరించలేదు. కాంగ్రెస్ తో కలిసి వెళితేనే పార్టీకి లాభమంటున్నారు ఏచూరి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఒంటరిగా బరిలోకి దిగితే గెలుపు సాధించడం కష్టమేనన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో కలిసి వెళితే ప్రభుత్వ ఓట్లు చీలకుండా ఉంటాయన్నది కొందరి వాదన.
మోడీకి లాభం చేయొద్దని.....
కాని ఇందుకు కేంద్ర కమిటీలోని సభ్యులు అంగీకరించకపోవడంతో సీతారాం ఏచూరి సమావేశంలోనే ఆవేదన చెందినట్లు సమాచారం. అందుకే తాను కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని సమావేశంలోనే ప్రకటించడంతో సభ్యులు దానిని అంగీకరించలేదు. పదవిలో కొనసాగాల్సిందేనని కేంద్ర కమిటీ నిర్ణయించింది. మోడీ బలమైన నేతఅని, ఆయనను ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఏకమైతే అది సాధ్యమని చెప్పినా ఏచూరి మాట ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ తో ఈ కమ్యునిస్టు పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయదని దాదాపు తేలిపోయింది. ఇంకా పాత సంప్రదాయాలను పట్టుకుని వేలాడితే అసలుకే ప్రమాదమని గుర్తించాలని వామపక్షనేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా పార్టీ అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
- Tags
- సీపీఎం

