వీరిలో ఎవరు లక్కీ ఫెలోనో....?

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనుండటంతో ఆయన టీంలో చేరేందుకు చాలా మంది ఉత్సాహ పడుతున్నారు. ఏఐసీసీ పదవుల కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఏఐసీసీలో చోటు దక్కించుకునేందుకు పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ టీంలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. ఏఐసీసీ పదవులు పందేరం ప్రారంభం కానుండటంతో ఇప్పటికే కొందరు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ పదవులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర నుంచి పలువురు మాజీ కేంద్రమంత్రులు ఈ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పార్టీలో కీలక పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ లు కూడా గట్టిగానే పదవులు పొందేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. అలాగే గత నాలుగేళ్లుగా పీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డిని తప్పించాలన్న డిమాండ్ ఉంది. ఆయనను పీసీసీ చీఫ్ నుంచి తొలగిస్తే ఆయనకు జాతీయ స్థాయిలో పదవి లభిస్తుందని చెబుతున్నారు.
ఢిల్లీలో లాబీయింగ్....
తెలంగాణలో కూడా అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి ఎక్కువ మంది పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శులుగా కొనసాగుతున్న మధు యాష్కీ, చిన్నారెడ్డిలు మరోసారి పదవులను దక్కించుకునేందుకు ట్రై చేస్తున్నారు. మధుయాష్కీకి ఖచ్చితంగా రాహుల్ టీంలో అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పదవిని పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇక మాజీ కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ లు కూడా ట్రై చేస్తున్నారు. వీరితో పాటుగా అధిష్టానంతో నిత్యం టచ్ లో ఉండే మర్రి శశిధర్ రెడ్డి, వి.హనుమంతరావులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం మీద ఎవరికి పదవి వస్తుందో... ఎవరిని పక్కన పెడతారో అన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. 2019 ఎన్నికలు పార్టీకి కీలకం కావడంతో అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే పదవుల పందేరం చేయాలని రాహుల్ యోచిస్తున్నారు.
- Tags
- కాంగ్రెస్

