‘వీర’ శివారెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా?

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి, టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి విందు రాజకీయాలకు తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం వీరిరువురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో ముందుగానే ఎన్నికలు వచ్చేసినంత సందడి నెలకొంది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి ఫ్లెక్సీల్లోనూ వీరి విభేదాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
భారీ విందు ఏర్పాటు...
నిన్న జనవరి 1వ తేదీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు టీడీపీలోని అన్ని స్థాయుల్లో నేతలను ఆహ్వానించారు. దాదాపుగా అందరూ హాజరయ్యారు. వీరశివారెడ్డికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మద్దతు ఉండటంతో ఆయన వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని గట్టిగా చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న వీరశివారెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2014లో ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. పుత్తా నరసింహారెడ్డికే టిక్కెట్ ఇచ్చింది. అయితే అధిష్టానం సూచన మేరకు పుత్తా నరసింహారెడ్డి గెలుపుకు వీర శివారెడ్డి కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారు.
సీఎం రమేష్ మద్దతుతోనే...
అయితే వీరశివారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. సీఎం రమేష్ ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రమేష్ సాయంతో వీరశివారెడ్డి తన తనయుడు అనిల్ కుమార్ రెడ్డిని డీసీసీబీ ఛైర్మన్ గా చేయించుకోగలిగారు. నిన్న మొన్నటి వరకూ నిశ్శబ్దంగా ఉన్న వీరశివారెడ్డి కొత్త ఏడాది నుంచి తన ప్రతాపం చూపాలనుకున్నారేమో. విందు రాజకీయాలకు తెరలేపారు. కమలాపురంలో వీర శివారెడ్డి ఏర్పాటు చేసిన విందుకు టీడీపీ శ్రేణులనుంచి మంచి స్పందన లభించడంతో వీర శివారెడ్డి ఇక తనకే టిక్కెట్ అని చెబుతున్నారు.
పుత్తా కూడా తగ్గడం లేదుగా...
దీంతో పుత్తా నరసింహారెడ్డి మద్దతు దారులు కూడా వీరశివారెడ్డికి పోటీగా కమలాపురం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో వీరశివారెడ్డి ఫొటో లేకుండా జాగ్రత్త పడ్డారు. వీరశివారెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ పుత్తా ఫొటోలేదు. మొత్తం మీద ఈసారి కమలాపురం నియోజకవర్గంలో టిక్కెట్ కోసం పుత్తా, వీర శివారెడ్డిలు తీవ్రంగానే ప్రయత్నించే అవకాశముంది. మరి టిక్కెట్ ఎవరికి దక్కుతుందో కాని ఇప్పటి నుంచే టీడీపీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి.
- Tags
- వీర శివారెడ్డి

