విహారం విషాదంగా మారడం వెనుక ...?

నీరు, నిప్పు,గాలి,ఆకాశం,భూమి వీటిని పంచభూతాలుగా పిలుస్తాం. ఏ మాత్రం అజాగర్దగా వ్యవహరించినా ప్రాణాధారమైన ఈ ఐదింటిలో ఏవైనా కబళిస్తాయి. తాజాగా కృష్ణా జిల్లా లో జరిగిన పడవ ప్రమాదం ఇదే విషయాన్నీ మరోసారి పెను విషాదరూపంలో చెప్పక చెబుతుంది. సురక్షితంగా సాగాలిసిన విహార యాత్రలు విషాదకరంగా మారడం వెనుక అనేక కారణాలే ఉంటున్నాయి. ప్రభుత్వం గతంలో జరిగిన ప్రమాదాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే.
గతంలోనూ అనేక ప్రమాదాలు....
ప్రమాదాలు జరిగి జనం చనిపోయాకా, ప్రభుత్వంలో ఎవరు వున్నా, ప్రమాద తీవ్రత ను, మరణించిన వారు సంఖ్యను బట్టి తమకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే నష్టపరిహారం భారీగా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. ఒకరిద్దరు మరణించినప్పుడు మీడియా లో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు కనుక కొన్ని సందర్భాల్లో నష్టపరిహారం ప్రకటించే వారే ఉండటం లేదు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విషయాన్నీ ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలు అరికట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం కానీ ఉండకపోవడం శోచనీయం. కృష్ణా, గోదావరి నదుల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం పాలకుల అధికార్ల నిర్లక్ష్య వైఖరే. గతంలో గోదావరిలో విహార యాత్రకు వెళ్లిన రాజమండ్రి న్యాయవాదుల బృందం అన్ని తెలిసినా నాటు పడవలో అధికసంఖ్యలో వెళ్లి ఐదుగురు యువ న్యాయవాదులను కోల్పోయింది. ఇప్పుడు అంతే అనుమతి లేని బోటు ప్రయాణిస్తున్నా అడ్డుకునే వారే లేరు. కారణం అనధికారికంగా అధికారుల్లో కొందరు ఇలాంటి వ్యాపారాలు చేయడమే.
చిన్నపాటి జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి ...
నది లేదా సముద్రాల్లో విహరించే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడతాయి. ఎక్కే పడవ లేదా లాంచీ, పంటు లకు లైఫ్ జాకెట్స్ కానీ టైర్లు కానీ అందులో ప్రయాణించే వారికి సరిపడా ఉన్నాయా లేదో చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎందరు అందులో ప్రయాణం చేసే వీలుంది ? ఎంత మందిని తీసుకువెళుతున్నారో తెలుసుకోవాలి . పరిమితికి మించి ఉంటే ఆగిపోవాలి. బోటు నడిపే వారు సరైన స్థితిలో ఉన్నారా మద్యం సేవించి వున్నారో గమనించాలి. వారి అనుభవం వీలయితే తెలుసుకోవాలి. ఆ బోటు కు లైసెన్స్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి.. బోటు లేదా లాంచ్ ఇసుక తిప్పలను, రాళ్ళ దిబ్బలను నీటిలో ఒక్కోసారి ఢీ కొని పక్కకు ఒరిగిపోతాయి . అలాంటి సందర్భాల్లో ఆందోళనతో ప్రయాణికులు అందరు ఒకే చోటకు కానీ ఒక పక్కకు వెళ్లడం మూలంగా ఆ బరువుకి బొట్లు తిరగబడతాయి. నీటి ప్రయాణాల్లో చాలా వరకు ఒకే చోట కూర్చోవడం చిన్న సైజు పడవల్లో మరీ అవసరం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రయాణికులు సమయం వృధా అనుకుని ప్రయాణానికి సిద్ధం అవుతారు. ప్రమాదం జరిగాక వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి.
తూతూ మంత్రంగా విచారణలు ...
ప్రమాదం చోటు చేసుకోగానే ప్రభుత్వాలు చేసేవి రెండే రెండు. ఒకటి నష్టపరిహారం రెండు విచారణకు ఆదేశించడం. అక్కడితో మీడియా ద్వారా ప్రజలను, బాధిత కుటుంబాలను సంతృప్తి పరిచాము అని భావిస్తున్నారు తప్ప విచారణలో దోషులకు శిక్ష పడటం చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ ఇంతకు ముందు జరిగిన ప్రమాదాలు గమనించినా, పుష్కర తొక్కిసలాటలో 29 మంది చనిపోవడం చెప్పుకోవొచ్చు. పుష్కర తొక్కిసలాటపై నేటికీ ఒక్కరిపైనా విచారణ పూర్తి అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కనిపిస్తూనే వుంది. ఇలాంటి ధోరణి అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో జరిగిన విచారణల సందర్భంగా ఆయా అధికారులు, కమిషన్ల నివేదికలు చేసిన సూచనలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రజల విలువైన ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

