విశాఖలో ఇడియట్ సినిమాలో ప్రకాష్ రాజ్ లా ...?

ఒక పోలీస్ అధికారి, ఒక పత్రిక అధిపతి, ఒక రౌడీషీటర్ వీరంతా చేసిన ఘన కార్యం పాపం పండటంతో బద్దలైంది. విశాఖలో వెలుగుచూసిన ఘాతుకం సంచలనమే అయ్యింది. ఒక డిఎస్పీ ఒక మహిళతో పెట్టుకున్న అక్రమసంబంధం ఆమె హత్యకు దారితీయడం ఆ ప్లాన్ లో ప్రయోగించిన రౌడీ షీటర్ డీఎస్పీని బెదిరించడం అతడిని అడ్డు తొలగించుకోవడానికి ఒక పత్రికా అధిపతితో పోలీస్ అధికారి స్కెచ్ గీయడం, బ్లాక్ మెయిలర్ ను చంపించాకా హమ్మయ్య అనుకున్నా ఒక చిన్న క్లూ తో మొత్తం బండారం బట్టబయలు కావడం జరిగిపోయాయి.
ఒక హత్యకేసు మరో హత్యను బయటపెట్టింది ...
విశాఖపట్నం సిటీ కమిషనరేట్ లో ఎసిపిగా పని చేసి ప్రస్తుతం విజిలెన్స్ డీఎస్పీగా వున్న దాసరి రవిబాబుకి యలమంచలి ఎంపిపి తో వివాహేతర సంబంధం వుంది. ఆయన రూరల్ పరిధిలో పనిచేసేటప్పుడు వారిమధ్య బంధం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరిమధ్య ఏర్పడ్డ విభేదాలు పద్మలతను అడ్డుతొలగించుకోవాలని రవిబాబు డిసైడ్ అయ్యేదాకా వెళ్ళింది. ఆ విషయాన్నీ పద్మలత ముందే పసిగట్టారు . తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని ఆమె గతంలో మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేసినా పోలీస్ రక్షణ కోరినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు .ఇదిలా ఉండగా ఎసిపి రవిబాబు పద్మలతను అడ్డుతొలగించుకోవడానికి గేదెల రాజు అనే విశాఖ రౌడీ షీటర్ తో కోటిరూపాయలకు సఫారీ ఇచ్చేలా ఒప్పందం అయ్యింది . కట్ చేస్తే అనారోగ్యంతో పద్మలత కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. అలా అత్యంత పకడ్బందీగా గేదెల రాజు ఆమెను చంపినట్లు తాజాగా తేలింది. ఈ హత్య తరువాత రవిబాబు 50 లక్షలు మాత్రమే గేదెల రాజుకి ముట్టజెప్పి మిగిలిన సొమ్ము ఎగ్గొట్టారు. దీనిపై ఇరువురి నడుమ పంచాయితీ గట్టిగా నడిచింది.
రాజును లేపేస్తే లైన్ క్లియర్ అవుతుంది అనుకుని ...
రౌడీషీటర్ గేదెల రాజును లేపేస్తే కధ సుఖాంతం అవుతుందని భావించిన రవిబాబు ఈసారి విశాఖలోని క్షత్రియ భేరి సంపాదకుడు భూపతి రాజును ఆశ్రయించాడు. గేదెల రాజు మర్డర్ కి ఐదు లక్షలకు డీల్ కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు భూపతిరాజు తన కార్యాలయానికి పిలిపించాడు. అక్కడికి వచ్చిన గేదెలరాజును భూపతి రాజు మనుషులు రాడ్డులతో కొట్టి చంపేశారు . స్లాబ్ పై పడిన రక్తాన్ని ఆధారాలు లేకుండా తుడిచేశారు. ఆ తరువాత మృతదేహాన్ని సబ్బవరం దగ్గర దేవరపల్లిలో రోడ్డుపై డీజిల్ వేసి కాల్చేశారు.
హంతకులను పట్టించిన గేదెలరాజు వాహనం ...
భూపతి రాజు దగ్గరకు గేదెల రాజు వేసుకుని వచ్చిన వాహనం క్షత్రియ భేరి కార్యాలయంలోనే వుంది. దాన్ని అక్కడినుంచి మాయం చేసేందుకు హంతకుల్లో ఒకరు తీసుకువెళుతున్న సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడింది. హంతకుడి ద్వారా వాహనం పూర్తి వివరాలు బయటకు రావడం గేదెల రాజు మిస్సింగ్ కేసు ను దర్యాప్త్ చేస్తున్న అధికారులకు తీగ దొరికేలా చేసింది. అక్కడి నుంచి డొంక కదిపితే గేదెల రాజు హత్య , అంతకుముందు పద్మలత హత్య వెనుక వున్న పెద్దమనుషులు అంతా ఒకటి తరువాత మరొకటి పోలీసులకు దర్యాప్తులో తేలుతుంటే అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈనెల 6 వతేదీన గేదెలరాజు మిస్సింగ్ మిస్టరీ ఆవిధంగా వారం రోజుల్లో బట్టబయలు అయ్యింది.
పరారీలో అసలు నిందితులు ...
ప్రస్తుతం ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గేదెలరాజును హత్య చేసి డీజిల్ పోసి తగులబెట్టినట్లు ఖాకీలు వెల్లడించారు. ఇక అసలు నిందితులైన క్షత్రియ భేరి ఎడిటర్ భూపతిరాజు, విజిలెన్స్ డిఎస్పీ దాసరి రవిబాబు పరారీలో వున్నారు. సమాజంలో ఒక బాధ్యతాయుత హోదాలో వున్న పోలీస్ శాఖ అధికారి, మీడియా ప్రతినిధి ఈ హత్యలకు తెగబడటం పట్ల విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ నాగేంద్ర కుమార్ విచారం వెలిబుచ్చారు. అసాంఘిక శక్తులతో పోలీసులు చేతులు కలపడం అందరిని విస్మయపరుస్తుంది .

