విమాన ప్రమాదంలో రోజా సేఫ్

వైసిపి ఎమ్మెల్యే రోజా తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రోజా తో పాటు 120 మంది ప్రయాణికులు విమానంలో వున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తం అయిన విమానాశ్రయ క్రైసిస్ టీం మంటలను తక్షణమే అదుపులోనికి తెచ్చాయి. అయితే ప్రమాదం సంభవించిన వెంటనే విమానం డోర్స్ లాక్ అయిపోవడంతో ప్రయాణికులు రెండు గంటలపాటు ఫ్లైట్ లో ఉండిపోయారు. జరిగిన సంఘటనతో షాక్ కి గురైన వారంతా ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంటలను అదుపుచేసిన తరువాత ప్రయాణికులను సురక్షితంగా లాంజ్ కి చేర్చారు సిబ్బంది.
సేఫ్ అన్న రోజా ...
ప్రమాదం జరిగి అందులోనుంచి బయటపడ్డాక మేము సేఫ్ అంటూ రోజా ఒక వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో రోజా షాక్ లో ఉండగానే పంపడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కూడిన సినీ బృందం ప్రయాణించిన విమానం సాంకేతిక సమస్యలతో ఒక వ్యవసాయ క్షేత్రంలో దిగింది. ఆ ఫ్లైట్ కెప్టెన్ భల్లా చాకచక్యంగా ఒక పెను విషాదాన్ని తప్పించారు. అయితే సినీనటి సౌందర్య బెంగుళూర్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఆమె ఎక్కిన హెలికాఫ్టర్ గాల్లోకి ఎగరగానే మంటలు చెలరేగి ఆమె మృత్యువాత పడ్డారు. స్పీకర్ బాలయోగి ఎక్కిన హెలికాఫ్టర్ అలాగే ప్రమాదానికి గురికావడంతో ఆయన అందరికి దూరం అయ్యారు.
పేలుతున్న విమాన టైర్లు ...
ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు బాగా పెరిగిపోయాయి. ఫ్లైట్ కనెక్టివిటీ అనేక నగరాలతో ఏర్పడటం అతి తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో అంతా వీటి బాట పట్టారు. డిమాండ్ పెరగడంతో విమానయాన సంస్థలు సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాయి. అయితే నాణ్యత ప్రమాణాలు, తనిఖీలు మాత్రం గాలికి వదిలేస్తున్నట్లు ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా విమానాల ల్యాండింగ్ సమయంలో టైర్లు పేలుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీల నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎయిర్ లైన్స్ భద్రతా ప్రమాణాలను మరోసారి సమీక్షించుకోవాలిసి వుంది. ముఖ్యంగా టైర్లను తనిఖీ నిరంతరం చేయడంతో పాటు సుశిక్షితులైన పైలట్లనే చోదకులుగా వినియోగించాలిసిన అవసరం ఎంతైనా వుంది. దీనిపై పౌర విమానయాన శాఖ సీరియస్ గా దృష్టి సారించాలి. లేనిపక్షంలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారె దుస్థితి కొనసాగుతుంది.
