విప్లవ్...మూడేళ్ల కష్టం

త్రిపురలో తొలిసారి కమలం జెండా ఎగిరింది. భీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. త్రిపురలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు హాజరయ్యారు. 25 ఏళ్ల పాటు త్రిపురలో ఎర్ర జెండా తప్ప మరేది ఎగరలేదు. అయితే బలమైన కంచుకోటను బద్దలు కొట్టి తొలిసారి కమలం జెండా ఎగరడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవదులు లేవు. అయితే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ గురించి చెప్పుకోవాల్సిందే.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం....
ప్రస్తుత త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. దాదాపు పదహారేళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లోనూ, పార్టీలోనూ పనిచేశారు. త్రిపుర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో 2016లో ఆయనను బీజేపీ అధిష్టానం త్రిపురకు పంపింది. విప్లవ్ కుమార్ త్రిపురలోనే పుట్టిపెరిగారు. దీంతో ఆయనపై పార్టీ నమ్మకం పెట్టుకుంది. 2016లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన విప్లవ్ ప్రతి రోజూనూ తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఏ క్షణం వృధా చేయకుండా ప్రజల్లో మమేకమై మెలిగారు. వారి సమస్యలను దగ్గరనుంచి తెలుసుకోవడానికి వారి చెంతకే వెళ్లారు.
మాణిక్ అంటే ఇష్టం....
అలా దాదాపు మూడేళ్ల పాటు కష్టానికి పడిన ప్రతిఫలం విప్లవ్ కు దక్కింది. త్రిపురలో బీజేపీ 60 స్థానాలకు గాను 35 స్థానాలను దక్కించుకుని విజయతీరాలకు చేర్చడంలో విప్లవ్ ది ప్రముఖ పాత్రేనంటారు. విప్లవ్ కుమార్ వయస్సు 48 ఏళ్లు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా చేపట్టిన విప్లవ్ కుమార్ తనకు మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అంటే అత్యంత ఇష్టమంటారు. తన ప్రమాణ స్వీకారానికి ఆయననూ పిలిచారు. ఆశీర్వాదం తీసుకున్నారు. త్రిపురను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు విప్లవ్ కుమార్.
