విపక్షాల నోటికి తాళమేసేలా... కేసీఆర్ చర్యలు!

‘‘మీకు మాత్రం వంద గదులతో బంగళాను నిర్మించుకున్నారు. మరి పేదలకు హామీ ఇచ్చిన రెండు పడగ్గదుల ఇళ్లెక్కడ.. పేదలను మీరు వంచిస్తున్నారు..’’ అంటూ కేసీఆర్ అధికారిక నివాసం ప్రారంభం అయిన నాటినుంచి ఇవాళ్టి వరకు విపక్షాలు కాంగ్రెస్, తెలుగుదేశాలకు చెందిన నాయకులు ఎన్నెన్ని మాటలు అన్నారో లెక్కేలేదు. రెండు పడగ్గదుల ఇళ్ల నిర్మాణం అనే హామీని ప్రభుత్వం తుంగలో తొక్కేసిందంటూ.. వారు ఎగిరెగిరి పడ్డారు. అయితే వారి నోర్లకు తాళాలే వేసేలా.. ముఖ్య మంత్రి కేసీఆర్ ఇవాళ 530 రెండు పడగ్గదుల ఇళ్లలో పేదలతో గృహప్రవేశం చేయించబోతున్నారు. కేవలం పేదలకు కట్టించిన ఇళ్లను ప్రారంభించడం మాత్రమే కాదు.. అసలు విపక్షాలు మళ్లీ నోరెత్తకుండా ఉండేలా మరి కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు.
సోమవారం నాడు కేసీఆర్ దత్త గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో మొత్తం ఊరు ఊరంతా రెండు పడగ్గదుల పక్కా ఇళ్లలోకి గృహప్రవేశం చేయబోతున్నారు. మొత్తం 530 ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన విలక్షణ శైలిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదో పేదలకు ఇళ్లు గనుక.. రిబ్బను కత్తిరించి వచ్చేయకుండా.. ప్రతి ఇంటిలోనూ శాస్త్రోక్తంగా గృహప్రవేశ కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం తరఫునే ఏర్పాట్లు చేయిస్తున్నారు. అన్ని ఇళ్లలోనూ ఆయా ఇంటి యజమానులైన దంపతులతో శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకు ప్రతి ఇంటికి ఒకరు వంతున 500 కు పైగా పురోహితుల్ని కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ మరో కల్యాణ మండపంలో కూర్చుని ప్రత్యేక పూజలు చేస్తారు. గృహప్రవేశాలు అయినతర్వాత కేసీఆర్ తో కలిసి అదే చోట అందరికీ సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ రకంగా పేదలకు పక్కాఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని సాధారణ ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా కేసీఆర్ చాలా వైభవంగా ప్లాన్ చేయడం విశేషం. ఇంత జరుగుతూ ఉండగా రెండు పడగ్గదుల ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధిని ఎవరైనా నిందిస్తే.. ప్రజలే ఆమోదించే పరస్థితి లేదని పార్టీశ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నాయి.
అందరికీ ఈ ఆఫర్ ఉంటుందా?
లబ్ధిదారులకు ఇళ్లతో పాటు ఓ పాడిగేదెను, కోళ్లను కూడా అందిస్తున్నారు. అంతర్గత రోడ్లు మురుగునీటి వ్యవస్థ అంతా పక్కగా ఏర్పాటు చేశారు. అయితే మిగిలిన రాష్ట్రానికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవి దత్తగ్రామాలు గనుక.. అక్కడి లబ్ధిదారులకు మాత్రమే పాడిగేదె, కోళ్లు ఇస్తున్నారా? లేదా రాష్ట్రమంతా కూడా గ్రామాల్లో ఇళ్లు పొందిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందా అనే సందేహం కలుగుతోంది.

