విగ్రహాల విధ్వంసం...ఎందుకు...ఎలా?

దేశంలోని త్రిపుర,తమిళనాడు రాష్ట్రాల్లో విగ్రహాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. త్రిపురలో లెనిన్ విగ్రహం, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఆ రాష్ట్రాల్లో టెన్షన్ నెలకొంది. త్రిపురలో రెండు దశాబ్దాల కమ్యునిస్టుల పాలనను కాదని ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మాణిక్ సర్కార్ సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఉన్న లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో రాష్ట్రంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పెద్దయెత్తున హింస చెలరేగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై సాయుధ బలగాలను మొహరించారు.
త్రిపురలో ఉద్రిక్తత....
లెనిన్ విగ్రహం కూల్చివేయడంతో దేశవ్యాప్తంగా సీపీఎం పెద్దయెత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని కమ్యునిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చి వేసిన వెంటనే భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారని, ఇది వారి పనేనని చెబుతున్నారు వామపక్ష పార్టీ నేతలు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎవరో పిచ్చి వాళ్లు చేసిన పనికి తాము ఎలా బాధ్యత వహిస్తామన్నారు. పోలీసులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కమలనాధులు చెబుతున్నారు.
తమిళనాడులో ఆందోళనలు....
ఇదిలా ఉండగా తమిళనాడులోపెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సంచలనం కల్గించింది. దీనిపై భగ్గుమన్న కొందరు కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోలు బాంబు విసిరారు. దీంతో తమిళనాడు అంతటా ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల బీజేపీజాతీయ కార్యదర్శి హెచ్. రాజా పెరియార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. అయితే విగ్రహాల విధ్వంసంపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. విగ్రహాల విధ్వంసాన్ని ద్రవిడ జాతి క్షమించదన్నారు. కావేరి జలాల విషయం నుంచి దృష్టి మళ్లించడానికే విగ్రహాల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. బీజేపీ హెచ్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోడీ ఆగ్రహం....
దేశంలో విగ్రహాల విధ్వంసం వెనక ఎవరున్నారో కనుగొనాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఆయన విగ్రహాల విధ్వంసంపై తీవ్రంగా స్పందించారు. విగ్రహాల విధ్వంసాన్ని ఎవరూ ఆమోదించకూడదన్నారు. వెంటనే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను మోడీ ఆదేశించారు. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విగ్రహాల విధ్వంసం నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. మరోవైపు రాజ్యసభలో విగ్రహాల విధ్వంసంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. పిచ్చివాళ్లు మాత్రమే అలాంటి పనులు చేస్తారన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
