వాళ్ల రాకపై చంద్రబాబు మంచి ట్విస్టే ఇచ్చారు

విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా ముఖ్యమంత్రిని వెళ్లి కలిశారు. తమ తమ నియోజకవర్గాల సమస్యల గురించి కాదు గానీ.. విధాన పరంగా నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను తమకు కేటాయించడం లేదని ఓ ఫిర్యాదును ఆయన వద్దకు తీసుకువెళ్లారు. అయితే సీఎంతో భేటీ అనంతరం బయటకు వచ్చిన తరావత.. సీఎంతో భేటీ చాలా నిరాశాజనకంగా జరిగిందంటూ వారు ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన మర్యాదను కూడా సీఎం ఇవ్వలేదంటూ ఆయన మీద కూడా ఆరోపణలు గుప్పించారు. తమను పట్టించుకోకపోవడం కాదు కదా.. తమతో మాట్లాడడమే కక్షపూరితంగా మాట్లాడారంటూ ఆడిపోసుకున్నారు.
అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. వైకాపా ఎమ్మెల్యేలు వచ్చి తనను కలసి వెళ్లడాన్ని కూడా తనకే ఎడ్వాంటేజీగా మార్చుకుంటున్నారు. వారి రాకే.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం అని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని వైకాపా ఎమ్మెల్యేలు కూడా అంగీకరిస్తున్నారని, కాకపోతే.. అదంతా తమ చేతులమీదుగా జరగాలని వారు కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. విమర్శించే విపక్ష ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లిన వైనం కూడా.. చంద్రబాబు తనకు ఎడ్వాంటేజీగానే వాడుకోవడం చూసి.. ఆయన పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఎలాంటి ట్విస్టులైనా ఇవ్వగలరంటూ పలువురు భావించడం విశేషం.

