వారికి హరీశ్ వార్నింగ్

తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావుపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్ లో అంత ఆనందంగా లేరని, పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. అంతేకాదు తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు. హరీశ్ రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆయన బీజేపీ లోకి వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీలోకి వెళుతున్నట్లుగా....
అయితే ఈ ప్రచారం ఇటీవల ఊపందుకోవడంతో హరీశ్ రావు మీడియా ముందుకొచ్చారు. తన చావుపుట్టుక అంతా టీఆర్ఎస్ లోనేనని తెగేసి చెప్పారు. తనపై ప్రచారం చేస్తున్న వారిపై డిజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు హరీశ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టింగ్ లు చేస్తున్న వారు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీ ఎందుకు మారతానని హరీశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తన బాట అని హరీశ్ చెప్పుకొచ్చారు. తాను ఎక్కడ పోటీ చేయాలన్నదీ పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు.
కేసీఆర్ ఎలా చెప్తే అలా.....
తాను ఎమ్మెల్యేగా చేయమంటే అదే చేస్తానని, ఎంపీగా వెళ్లమన్నా వెళతానని, అయితే అదంతా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఇష్టంపైన ఆధారపడి ఉంటుందన్నారు. కేసీఆర్ మాటను కాదనే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. త్యాగాలు చేసిన కుటుంబం నుంచి తాను వచ్చానని గుర్తు చేశారు. తనపై ఇలాంటి వదంతులు చేయడం ప్రత్యర్థుల పనేనని తెలిపారు. ఈ వదంతులను పార్టీ శ్రేణులు నమ్మవద్దని చెప్పారు. కేసీఆర్ ఆదేశం ప్రకారమే తాను నడుచుకుంటానని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, మౌనంగా ఉంటే మరింత దుష్ప్రచారం చేస్తారనే ఈ విషయాలు చెబుతున్నానన్నారు. హరీశ్ రావుపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు చెక్ పెట్టారు.
- Tags
- హరీశ్ రావు
