వసుంధర ఇక ఇంటికే పరిమితమా...?

రాజస్థాన్ ఉప ఎన్నికల్లో దారుణ ఓటమితో బీజేపీ అధిష్టానం అలెర్ట్ అయిందా? ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఇదే విధంగా వెళితే భంగపాటు తప్పదని డిసైడ్ అయిందా? అందుకోసం ఎన్నికలకు ముందుగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని తొలగించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందా? అవుననే అంటున్నాయి జాతీయ పత్రికలు. రాజస్థాన్ లోని అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానంతో పాటు, మండల్ గఢ్ శానససభ సీట్లను కోల్పోవడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ ఓటమిపై పోస్ట్ మార్టం జరిపి నివేదిక ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసుంధరాజేను మార్చాల్సిందిగా రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షాకు లేఖలు కూడా రాయడం సంచలనమయింది.
ఓటమిపై సీరియస్....
సిట్టింగ్ స్థానాలు, సెంటిమెంట్ తో పనిలేకుండా కాంగ్రెస్ భారీ మెజారిటీతో నెగ్గడంపై బీజేపీ పెద్దలు అంతర్మధనంలో పడ్డారు. ఈ ఏడాదే రాజస్థాన్ ఎన్నికలు ఉండటంతో ఈ ఫలితాలు ప్రమాద ఘంటికలుగా భావించారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే, బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్ణిమి పనితీరుపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో వ్యతిరేకత ఉంటే తప్ప ప్రజలు వన్ సైడ్ గా వెళ్లరన్నది అధిష్టానం భావన. అందుకోసం రాజస్థాన్ నుంచి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ నివేదిక పంపాలని అమిత్ షా కోరారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత వసుంధర రాజే, అశోక్ లపై చర్యలుంటాయన్న వార్తలు జాతీయ మీడియాలో మార్మోగిపోతున్నాయి.
ప్రత్యేకంగా నివేదికలు....
వీరితోనే వచ్చే ఎన్నికలకు వెళితే కష్టమేనని భావించిన అధిష్టానం ఒకరిద్దరు సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ దారుణ ఓటమిపై ముఖ్యమంత్రి వసుంధర రాజేకూడా కంగు తిన్నారు. మరోవైపు జాతీయ మీడియాలో తనను మారుస్తున్నారన్న వార్తలు వస్తుండటంతో రాజే నిన్న అత్యవసరంగా శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. రాజస్థాన్ లో పెద్దయెత్తున్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అయినా ప్రజలు ఎందుకు తమను తిరస్కరించారో అర్ధం కాకుండా ఉందని వసుంధర రాజే సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది.
ధైర్యాన్ని నూరిపోసిన రాజే....
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉంది. ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వసుంధర రాజే శాసనసభ్యులకు పిలుపు నిచ్చారు. అంతేకాదు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై తనకు నేరుగా నివేదికలు ఇవ్వాలని, వెంటనే పరిష్కరిచడానికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యేల్లో భరోసా నింపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే ఉంటుందని, అధైర్య పడవద్దని వసుంధర ఎమ్మెల్యేలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రాజేను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ ఓటమికి బాధ్యులను చేస్తూ మార్చడం ఖాయమన్న వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.
- Tags
- వసుంధరరాజే

