లోకేష్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోసాని

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌పై రచయిత, దర్శకుడు, సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. సినీ, రాజకీయ నాయకుల మధ్య మాటల వార్‌కు తెరతీసింది. 2014,15,16 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులు ప్రకటించడం.. ఇందులో కొంతమందికి అవార్డులు రావడంపై మరికొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా తనదైన శైలిలో స్పందించారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్రమే విమర్శలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోసాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక రకంగా లోకేష్‌ను ఏకిపారేశారు.
తాము రోహింగ్యాలమా?
లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా?.. విమర్శించకూడదా.? అని ప్రశ్నించారు. 'లోకేశ్... చదువుకున్నావా.. బుద్ధి, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా? మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు' అంటూ నిలదీశారు. 'నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా? గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా? అప్పుడు ఆయన్ని నాన్ లోక్ అన్నారా' అని గుర్తుచేశారు.
జ్యూరీ సభ్యులు ఆంధ్రోళ్లేనా?
2014 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చని స్పష్టం చేశారు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా? అని దుయ్యబట్టారు. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాటేమిటని.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. 'వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?' రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదని, భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు.
అవార్డును తిరస్కరిస్తున్నా....
టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా ప్రకటించారు. 'ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా. అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. అందుకే ఈ అవార్డులను రద్దు చేయండి' అని చంద్రబాబును కోరారు. ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయాలని సూచించారు.
- Tags
- పోసాని

