లోకేష్‌కు ఉన్నంత ఆశ వారికి లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను అరకోటి దాటించాలనే భారీ లక్ష్యాలు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఉండవచ్చు గాక.. కానీ తెలంగాణ లోని తెలుగుదేశం నాయకత్వం మాత్రం అలాంటి ప్రకటనలు చేస్తే డాంబికాలుగా హాస్యాస్పదం అవుతుందని గుర్తించినట్లుంది. అందుకే తెలంగాణలో ఈ ఏడాదికి 15 లక్షల సభ్యత్వాలను చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం నాడు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ప్రారంభం అయింది. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధ్యక్షుడు ఎల్.రమణ తదితర నాయకులు ప్రారంభించారు. వీటితో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వం కూడా నడుస్తుందని వారు ప్రకటించారు.
తెలంగాణ లో కొత్త జిల్లాల స్వరూపం ప్రకారం పార్టీ కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు రమణ, రేవంత్ రెడ్డి వెల్లడించారు. దాదాపు ప్రతిచోటా యువనాయకత్వానికి బోల్డంత అవకాశం దక్కుతుందని పార్టీకి యువరక్తం ఎక్కిస్తామని నేతలు అంటున్నారు.
అయితే ... తెలంగాణలో పార్టీ పరిస్థితి నాయకత్వం పరంగా కొంత దెబ్బతినడం వల్ల బలహీన పడిన నేపథ్యంలో తెలంగాణ తెదేపా పరిమితంగానే తమ సభ్యత్వాల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ.. అందుకోగలుగుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే.. పార్టీని దాదాపుగా పూర్తిగా పునర్నిర్మించాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. తెరాసలోకి వెళ్లిన వారు అధికార పార్టీ అండతో కేడర్ ను మొత్తం సహజంగానే తమతో తీసుకువెళ్లారు. దీంతో తమ లక్ష్యాన్ని అందుకున్నా సరే తెతెదేపా మంచి పురోగతి సాధించినట్లే భావించాలని పార్టీ నాయకులు చెబుతున్నారు.

