లోకేష్ కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారా?

చంద్రబాబు తర్వాత ఆయనే నేత. పార్టీకి భవిష్యత్తూ ఆయనే. లీడర్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, మంత్రిత్వ శాఖపై పట్టు పెంచుకుంటూ తండ్రి చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఆయనే లోకేష్. అయితే రాష్ట్ర విభజన హామీలపై గత 20 రోజులుగా రచ్చ జరుగుతున్నా లోకేష్ మాట్లాడటం లేదు. అసలు ఈ విషయం పట్టీపట్టనట్లే వ్యవహరిస్తున్నారు. లోకేష్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీ పైన విమర్శలు చేయకపోవడానికి కారణాలేంటి? తాను ఎందుకు మాట్లాడటం అనుకున్నారా? లేక చంద్రబాబు డైరెక్షన్ తో ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారా? అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎందుకు మాట్లాడటం లేదు.....
అయితే లోకేష్ ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు. వచ్చి కూడా పది రోజులు దాటి పోతోంది. తన మంత్రిత్వ శాఖల సమీక్షలతో లోకేష్ బిజీగా ఉన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా హాజరయ్యారు. కాని కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పార్టీలో పెద్ద టాపిక్ అయి కూర్చుంది. ప్రతి విషయంలో లోకేష్ వచ్చి మాట్లాడతారు. ఏదైనా సభలోనైనా వైసీపీ మీద విరుచుకుపడతారు. అయితే ఆయన వీటన్నింటికీ కొంత దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాల కథనం.
లోకేష్ మాట్లాడతే బాబు గొంతుకే.....
కేంద్ర ప్రభుత్వం నుంచి లోకేష్ పలుమార్లు అవార్డులందుకున్నారు. లోకేష్ నిర్వహించే పంచాయతీరాజ్ శాఖలకు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి. అందువల్ల లోకేష్ కేంద్రంపై విమర్శలు చేయడం లేదా? అన్నది కూడా చర్చ జరుగుతోంది. దీంతో పాటు లోకేష్ మాట్లాడితే అది చంద్రబాబు మాట్లాడినట్లే అవుతుంది. మిగిలిన మంత్రులు మాట్లాడితే పరవాలేదు. రేపు ఏదైనా తాను మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశానని లీకులిచ్చుకునే ఛాన్స్ చంద్రబాబుకు ఉంది. కాని లోకేష్ విషయంలో అలా ఉండదు. అందుకనే ఈ విభజన హామీల విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయవద్దని చంద్రబాబు స్ట్రిక్ట్ గా లోకేష్ కు చెప్పారని పార్టీలో జోరుగా విన్పిస్తుంది. అందుకే లోకేష్ ఈ విభజన హామీలపైన గాని, కేంద్రంపైన గాని, అవిశ్వాసం, రాజీనామాల విషయంలో పెదవి విప్పడం లేదన్నది అమరావతిలో టాక్.
- Tags
- లోకేష్

