లోకేష్ అంటే బాబుకు అంత భయమా?

నారా లోకేష్ ను చంద్రబాబు ఇంకా విశ్వసించడం లేదా? లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకనే ఆయనను పెద్దగా వేలు పెట్టనీయడం లేదా? అవుననే అనిపిస్తున్నాయి వరుస సంఘటనలు చూస్తుంటే. నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు. నాన్చి....నాన్చి... చివరకు ఆరు నెలల క్రితం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత మంత్రిని చేశారు. కీలకమైన ఐటీ, పంచాయతీరాజ్ శాఖలను లోకేష్ చేతిలో పెట్టారు. అయితే లోకేష్ ఇంకా రాజకీయాలను పూర్తిగా అలవర్చుకోక పోవడం, ప్రసంగాల్లో పదును తేలకపోవడం వంటివి చంద్రబాబు గమనించారు. అనేక ప్రసంగాల్లో లోకేష్ తడబాట్లు పార్టీని నవ్వుల పాలు జేశాయి. దీంతో చంద్రబాబు లోకేష్ కు క్లాస్ పీకారట. ఒక సమావేశానికి వెళ్లే ముందు స్పీచ్ రెడీ చేసుకోవాలని, పాయింట్స్ రాసుకుని దానికి అనుగుణంగానే ప్రసంగించాలని హితబోధ చేశారట. అంతా బాగానే ఉంది. కాని విదేశాలకు కూడా తన వెంట లోకేష్ ను చంద్రబాబు తీసుకెళ్లడం లేదు. ముఖ్యంగా పెట్టుబడులు రాబట్టడమే థ్యేయంగా వెళ్లే మూడు దేశాల పర్యటనలో లోకేష్ ను తీసుకెళ్లాల్సింది. కాని లోకేష్ ను మాత్రం తీసుకెళ్లలేదు.
అందుకే దూరం పెట్టారా?
ఇక ఎన్నికల్లోనూ లోకేష్ ను దూరంగా పెట్టారు. నంద్యాల ఉప నియోజకవర్గ ఎన్నికలకు లోకేష్ దూరంగా ఉన్నారు. కేవలం అమరావతిలో కూర్చునే కొందరి నేతలకు డైరెక్షన్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతాయి. చంద్రబాబుకు అసలే భయం. ఒకవేళ నంద్యాలలో ఓటమిని చవిచూస్తే అందుకు బాధ్యత అంతా లోకేష్ పై పడుతుందని భయపడ్డారు. ఇక కాకినాడ కార్పొరేషన్ కు గుంటూరు జిల్లాక చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పంపారు కాని, లోకేష్ ను మాత్రం ఎంటర్ కానివ్వలేదు. ఎందుకంటే అక్కడా ఓటమి భయమే. లోకేష్ ను క్లీన్ ఇమేజ్ తో ఉంచాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా కన్పిస్తుంది. తాజాగా విదేశీ పర్యటనలకు కూడా లోకేష్ ను వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. లోకేష్ ను తీసుకెళితే తండ్రీకొడుకులు విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఏం రాబట్టారన్న ప్రశ్న ఎదురవుతుంది. అందుకే చంద్రబాబు లోకేష్ ను అన్నింటికీ దూరంగా ఉంచుతున్నారని, లోకేష్ పై ఎటువంటి నెగిటివ్ షేడ్ పడకుండా జాగ్రత్త పడుతున్నారన్నది పార్టీ వర్గాల టాక్.
- Tags
- లోకేష్

