లాలూకు కోత పెట్టారే...!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం ఝలక్ఇచ్చింది. లాలూకొనసాగుతున్న ఎన్ఎస్జీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. లాలూకు ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అంటే ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతగా ఉంటారు. అయితే ఆయనకు ప్రస్తుతమున్న జడ్ ప్లస్ కేటగిరీని తొలగించి జడ్ కేటగిరీకి భద్రతను కుదించింది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కేంద్రమంత్రిగా కొనసాగారు. ఆయనకు యూపీఏ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీని కేటాయించింది.
జడ్ కేటగిరీ మాత్రమే....
అయితే రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ప్రముఖుల భద్రతపై సమీక్షను నిర్వహించింది. ఇందులో లాలూకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనవసరమన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆయనకు ఆ భద్రతను తొలగించింది. జడ్ కేటగిరీ భద్రతలో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కమాండోలు మాత్రమే ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. దీనిపై లాలూ తీవ్రంగా స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రమాదంలో పడిందన్నారు. తనపై కుట్ర జరుగుతున్నట్లు అనుమానాన్ని లాలూ వ్యక్తం చేశారు. తనకు జడ్ ప్లస్ కేటగిరీ తొలగించినంత మాత్రాన భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. మరోవైపు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా మండిపడ్డారు. తన తండ్రికి ఏదైనా జరిగితే అందుకు ప్రధాని మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

