లలిత జ్యూయలర్స్ అధినేతకు ఆరులక్షలకు గుండు ...!

మీరు లలితా జ్యుయలర్స్ కు విచ్చేయండి. మీకు నచ్చిన మెచ్చిన నగను ఎంపిక చేసుకోండి. అది ఫోటో తీసుకోండి. ఎస్టిమేషన్ స్లిప్ కూడా పట్టుకెళ్లండి. నాలుగైదు షాపులు తిరగండి. మా దగ్గర కన్నా తక్కువ ధరకు ఎవరైనా ఇస్తే అక్కడే కొనండి. డబ్బులు ఊరికినే రావు కదా అంటూ సంచలన ప్రకటనతో తన షాప్ లకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ సంస్థ అధినేత కిరణ్ కుమార్ చేసే ప్రచారం ఇప్పుడు కొంప ముంచింది. టివి పెట్టి ఏ ఛానెల్ తిరగేసినా తన అందమైన గుండుతో అందరిని ఆకర్షిస్తూ చిలకపలుకులతో అన్ని షాప్ లను ఛాలెంజ్ చేస్తూ కోట్ల రూపాయల టర్నోవర్ కి కిరణ్ కుమార్ లలిత జ్యువెలరీ ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన దొంగలు తెలివిగా వాడి ఆరులక్షల రూపాయల విలువైన నగను దర్జాగా ఎత్తుకు పోయారు. అది ఎలాగంటే ..?
ప్రకటనే ప్లాన్ గా మలిచారు....
హైదరాబాద్ పంజాగుట్ట లలిత జ్యువెలరీ షాప్ కు ఇద్దరు మహిళలు నగలకోసం కొనుగోలుకు వెళ్లినట్లు బురఖాలు ధరించి వెళ్లారు. అందులో ఆరులక్షల రూపాయల విలువైన నగ వారిని ఆకర్షించింది. వెంటనే దాన్ని ఆసంస్థ యాడ్ లో చెప్పినట్లే ఫోటో తీసుకున్నారు. ఎస్టిమేషన్ స్లిప్ తూకంతో సహా తీసుకుని వెళ్ళిపోయారు. తిరిగి ఈనెల 3 వ తేదీ షాప్ కి నకిలీ నగ సేమ్ టూ సేమ్ తయారు చేయించి అసలు నగస్థానంలో డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ మాయం చేశారు. వారం తరువాత కానీ ఆ దొంగలు చేసిన పనిని లలిత జ్యువెలరీ సంస్థ గుర్తించలేక పోయింది. నగలు పరీక్షలు చేస్తుండగా అసలు విషయం తెలియడంతో గుండు బాస్ తో పాటు సిబ్బంది తెల్లమొహం వేశారు.
సిసి కెమెరా నిఘా ఉండగానే ....
చుట్టూ సిసి కెమెరాలు, బోల్డ్ మంది సిబ్బంది అంతా ఉండగానే ఈ వ్యవహారం చక్కగా పూర్తి చేశారు దొంగలు. అచ్చం సినీఫక్కీలో మక్కికి మక్కి డూప్లికేట్ నగ లాఘవంగా ఒరిజినల్ నగ స్థానంలో పెట్టేశారు. ఈ చోరీ విజువల్స్ చూసి పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. తన ప్రకటననే వాడి దొంగలు ఇలా గుండు కొడతారని కిరణ్ కుమార్ ఊహించలేదు. సో వ్యాపారులు తస్మాత్తు జాగర్త సుమి ..
- Tags
- లలిత జ్యుయలరీస్

