అమ్మ టెన్షన్ : లండన్ డాక్టరూ వచ్చారు...

ఒకవైపు పురట్చితలైవి జయలలిత అభిమానుల ఆందోళన తారస్థాయికి చేరుతుండగా.. వారికి కాస్త ఉపశమనం కలిగేలాగా అపోలో ఆస్పత్రి వైద్యులు సోమవారం మధ్యాహ్నం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అమ్మకు మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స అందించాల్సి ఉంటుందని ఆ బులెటిన్ లో ప్రకటించారు. మరో 24 గంటలపాటు జయలలిత వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆమె చికిత్స కొనసాగడానికి మధుమేహం అడ్డువస్తున్నదని, ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నదని అపోలో డాక్టర్లు చెప్పారు.
జయలలితకు ఎయిమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతతం చికిత్స సాగుతోంది. ఢిల్లీనుంచి ఎయిమ్స్ వైద్యులు నలుగురు ప్రత్యేకంగా ఇవాళ ఉదయమే చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. లండన్ నుంచి వచ్చి ఇదివరలో ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ రిచర్ బేలె ని కూడా పిలిపించారు. ఆయనకూడా సోమవారం మధ్యాహ్నానికి చెన్నై చేరుకున్నారు.
ప్రస్తతానికి జయలలితకు ఎక్మో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు. అయితే ఇతర వైద్యులు మాత్రం ఎక్మో సిస్టమ్ సక్సెస్ రేటు 60 శాతం మాత్రమే అని చెబుతున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నదని మరో 24 గంటలు గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలేం అని వైద్యులు అంటున్నారు.

