రేవంత్ వెంట గుంపులు...గుంపులుగా?

రేవంత్ రెడ్డి వెంట ఎవరెవరు వెళతారు. రేవంత్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఇదే టీడీపీలో టెన్షన్ గా మారింది. రేవంత్ రాజీనామా చేసి వెళ్లిన వెంటనే టీటీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రేవంత్ వెంట మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా రాజీనామా చేసేశారు. వేం నరేందర్ రెడ్డి, రేవంత్ లు ఇద్దరూ స్నేహితులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వేం నరేందర్ రెడ్డి విజయం కోసమే రేవంత్ ఓట్లకు నోట్ల కేసులో చిక్కుకున్నారు. వేం నరేందర్ రెడ్డి బాటలోనే కొందరు నేతలు పయనించే అవకాశముందని చంద్రబాబు వద్ద టీటీడీపీ నేతలు చెప్పినట్లు తెలిసింది.
టీటీడీపీ నేతల్లో టెన్షన్...టెన్షన్...
ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరి నేతల పేర్లను ప్రస్తావించారు. అలాగే నల్లగొండ కు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి అయితే నేరుగా చంద్రబాబు సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు సీనియర్లు కావాలనే రేవంత్ ను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కంచర్ల విలపించారు. అంతేకాదు గతంలో ఎన్టీఆర్ హయాంలో సంక్షోభానికి కారకులైన వారే నేడు రేవంత్ ను బయటకు పంపారని పరోక్షంగా యనమలపై విరుచుకుపడ్డారు కంచర్ల భూపాల్ రెడ్డి. కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ లో కూడా రేవంత్ హీరో అవుతారని కంచర్ల మీడియాకు చెప్పడం చూస్తుంటే ఆయన కూడా పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరితో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొందరు నేతలు కూడా రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఈనెల30వ తేదీన కొందరు టీటీడీపీ నేతలు పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఇకపై నెలలో ఒకరోజు హైదరాబాద్ వచ్చి పార్టీ పరిస్థితిన సమీక్షిస్తానని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ వచ్చి మరోసారి టీటీడీపీ నేతలతో సమావేశమవుతానని, ఆందోళన చెందవద్దని నచ్చజెప్పి టీటీడీపీ నేతలను పంపించి వేశారు.
- Tags
- రేవంత్ రెడ్డి

