రేవంత్ మళ్లీ కోర్టు తలుపు తడతాడా?

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దూకుడుగా చాలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నది. ప్రజాసంక్షేమానికి సంబంధించిన పథకాలతో పాటు, ప్రత్యేకించి... అయినవారికి పదవులు పంచిపెట్టే విషయంలోనూ కేసీఆర్ చాలా దూకుడుగా ఉదారంగానే వ్యవహరించారు. తెలంగాణ చిన్న రాష్ట్రం గనుక.. కేబినెట్ పదవుల సంఖ్య కూడా పరిమితమే కాగా, కేబినెట్ హోదాకు సమానమైన పదవులు అనేకం సృష్టించి అడిగినవారికి లేదనకుండా పంచిపెట్టేశారు. ఈ విషయంలో అప్పట్లోనే వివాదంగా మారడం.. న్యాయస్థానం ఎదుటకు వెళ్లి.. హైకోర్టు జెల్లకాయ వేయడంతో.. కేబినెట్ హోదాలోని కొన్ని పోస్టుల్ని అనివార్యంగా రద్దు చేయడమూ జరిగిది.
ఇప్పుడు ఇలాంటి కేబినెట్ ర్యాంకు పదవులు మళ్లీ కోర్టు వద్దకు వెళ్లే వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటి సంకేతాలు ఇస్తున్నారు.
కేసీఆర్ సర్కారు రాజ్యాంగ నిబంధనలకు, హైకోర్టు తీర్పుకు అతిక్రమణగా పరిమితికి మించి కేబినెట్ హోదా పోస్టులు ఇచ్చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మాత్రమే కేబినెట్ ర్యాంకు హోదా ఇచ్చే అవకాశం ఉంటుందని.. ఆలెక్కన తెలంగాణకు 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో పార్లమెంటరీ కార్యదర్శులనే పేరుతో కేబినెట్ హోదా కట్టబెట్టినప్పుడు కోర్టు స్టే ఇచ్చిన వైనం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు, చీఫ్ సెక్రటరీ కి ఈవిషయమై ఫిర్యాదు చేయడం లాంఛనమే నని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం పై గవర్నరుకు ఫిర్యాదు చేసిన అంశాలతోనే రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. కొత్తగా పంచుతున్న హోదాల మీద మరోసారి కేసీఆర్ సర్కారుకు చికాకు తప్పకపోవచ్చు.

