రేవంత్ పై పయ్యావుల ఫైర్

టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎట్టకేలకు స్పందించారు. రేవంత్ రెడ్డి ఆరు నెలల నుంచి ఢిల్లీ పర్యటన సమాచారం మొత్తం తన వద్ద ఉందని పయ్యావుల ధ్వజమెత్తారు. పయ్యావుల కేశవ్ కు, పరిటాల సునీత కుటుంబానికి తెలంగాణలో పరిశ్రమలున్నాయని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు గాని, పరిటాల కుటుంబానికి ఎలాంటి పరిశ్రమలు తెలంగాణలో లేవని పయ్యావుల స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. తాను కేసీఆర్ ను కలిస్తే దానికి సంబంధాలు అంటగట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని పయ్యావులు చెప్పుకొచ్చారు. అంతేతప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. పాతికేళ్లుగా పార్టీ కోసమే కష్టపడుతున్నానన్నారు.
జగన్, కవితతోనూ వ్యాపారాలు.....
రేవంత్ కు వ్యక్తిగత అజెండానే ప్రధానమన్న పయ్యావుల కేశవ్, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పై తానుఇప్పుడే వ్యాఖ్యానించబోనన్నారు. కాని రేవంత్ ఢిల్లీలో ఎవరెవరినికలిసిందీ తనకు తెలుసన్నారు. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాతనే తాను పూర్తి వివరాలు బయటపెడతానని పయ్యావుల చెప్పారు. యనమలను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదన్నారు. పార్టీ రేవంత్ కు ఎంతో గౌరవమిచ్చిందని, దాన్ని రేవంత్ కాపాడుకోలేక పోయారన్నారు. తాను పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎప్పుడూ వ్యవహరించబోనన్నారు. వైసీపీ అధినేత జగన్ తోనూ రేవంత్ రెడ్డికి సంబంధాలున్నాయన్నారు. ఎంపీ కవితతో కలిసి వ్యాపారం చేయించడానికి రేవంత్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని పయ్యావుల మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు.
- Tags
- పయ్యావుల కేశవ్

