రేవంత్ తో రెడీ అవుతుంది ఈయనేనా?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడంగల్ ను దక్కించుకోవాలన్నది టీఆర్ఎస్ ప్లాన్. మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు. కొడంగల్ మరో ఎత్తు. అందుకే కొడంగల్ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిర్ణయించినట్లుంది. ఉప ఎన్నిక వచ్చినా... సాధారణ ఎన్నిక వచ్చినా ఈసారి కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. కొడంగల్ నియోజకవర్గానికి మంత్రులు క్యూ కడుతున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావిడి చేస్తున్నారు.
ఉప ఎన్నికైనా సరే...సాధారణ ఎన్నికైనా...
కొడంగల్ లో అధికార పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయనను మంత్రులే దగ్గరుండి ప్రజలకు పరిచయం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా మాత్రం మిస్టరీగానే ఉంది. ఒకవేళ రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక జరగొచ్చు. లేకుంటే సాధారణ ఎన్నికలకయినా ఉపయోగపడుతుందని మంత్రులు పర్యటనలను విస్తృతంగా జరుపుతున్నారు. నరేందర్ రెడ్డి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడే మకాం వేసి ఉన్నారు.
రేవంత్ ను ఓడించాలన్న ధ్యేయంగా...
మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం విసిరేసినట్లుంటుంది. ఈ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ సహజంగానే దానిపై సీతకన్నేసింది. అయితే వచ్చే శాసనసభకు రేవంత్ రెడ్డిని రానివ్వకుండా చేయాలంటే కొడంగల్ లో పట్టు సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తరచూ కొడంగల్ నియోజకవర్గంపై సమీక్ష జరుపుతున్నారు.
తాను సిద్ధంగా ఉన్నానంటున్న రేవంత్....
ఇప్పటికే మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, హరీశ్ రావులు కొడంగల్ నియోజకవర్గాన్ని పర్యటించి వచ్చారు. ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు వచ్చినా తాము సిద్ధమేనంటూ సవాల్ విసురుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కొడంగల్ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమంటూ మంత్రులకు సవాల్ విసురుతూ ఆయన పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. తాను కొడంగల్ ను వీడే ప్రసక్తి లేదని, తన సమాధి కూడా ఇక్కడే ఉంటుందని సెంటిమెంట్ తో రేవంత్ ఆకట్టుకుంటున్నారు. మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి అలుముకుంది.
- Tags
- రేవంత్ రెడ్డి

