రేవంత్ కు ఈ సంస్కృతి అలవాటు కాలేదా?

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రాక కొందరి నేతలకు ఇష్టం లేనట్లుంది. ఆయన గాంధీభవన్ వచ్చినా కూడా కొందరు పలకరించడం లేదు. రేవంత్ కు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియడం లేదు. సరైన సమాచారం గాంధీభవన్ సిబ్బంది కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ వెనుదిరిగి వెళ్లారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నా నిన్న మొన్నటి వరకూ గాంధీభవన్ కు రాలేదు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ నెల 9వ తేదీన తొలిసారి రేవంత్ గాంధీభవన్ కు వచ్చారు. గాంధీభవన్ కు కూడా భారీ ర్యాలీతో వచ్చారు. సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురేగి మరీ రేవంత్ ను గాంధీభవన్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ అదరగొట్టే ప్రసంగం చేశారు. అందరూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని తమ ప్రసంగాల్లో హైలెట్ చేస్తే.. రేవంత్ మాత్రం మంత్రి కేటీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ మాట్లాడినంతసేపూ కార్యకర్తలు, నేతలు నిశ్శబ్దంగా ఉన్నారు. చపట్లుకొట్టారు. అయితే రేవంత్ ప్రసంగం ముగిసిన వెంటనే కార్యకర్తలందరూ ప్రాంగణం నుంచి లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో వేదికపై ఉన్న నేతలంతా అవాక్కయ్యారు.
సీటు లేక తిరిగి వెళ్లిన....
ఇంకా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టు విక్రమార్క మాట్లాడవలసి ఉన్నా రేవంత్ ప్రసంగం తర్వాత వారు వెళ్లిపోవడడంతో కొందరు కాంగ్రెస్ నేతలు సీరియస్ అయినట్లు సమాచారం. వీరంతా రేవంత్ వెంట వచ్చిన వారేనని, ఆయనస్పీచ్ అయిపోగానే వెళ్లిపోయారని, ఇదేం పద్ధతని కొందరు ఉత్తమ్ ను నిలదీసినట్లు తెలిసింది. సరే...9వ తేదీన గాంధీభవన్ కు మందీ మార్బలంతో వచ్చిన రేవంత్ ఈనెల 11వ తేదీ కూడా గాంధీభవన్ కువచ్చారు. అయితే అక్కడ కూర్చోవడానికి సీటు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో కూర్చున్నారు. అయితే అదిచూసిన గాంధీభవన్ సిబ్బంది ఇక్కడ కూర్చోకూడదని, బయట హాల్లో కూర్చోవాలని రేవంత్ కు చెప్పడంతో కాంగ్రెస్ సంప్రదాయం అర్థంకాని రేవంత్ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే రేవంత్ కు ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆయన లేకపోవడం వల్లనే గాంధీభవన్ సిబ్బంది కూడా ఆయనను పట్టించుకోలేదన్నది రేవంత్ అనుచరుల వాదన. మొత్తం మీద రేవంత్ కు కాంగ్రెస్ సంస్కృతిని అలవర్చుకోవడానికి ఇంకా సమయం పట్టేటట్లుంది.
- Tags
- రేవంత్ రెడ్డి

