రేవంత్ ఏం చేయబోతున్నారు....?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించనున్నారు. ఈరోజు 11 గంటలకు జలవిహార్ లో ముఖ్య అనుచరులు, నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే జలవిహార్ లో సమావేశానికి పోలీసులు అనుమతించలేదు. రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి దరఖాస్తు చేసుకోనందునే తాము అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సమావేశాన్ని రేవంత్ రెడ్డి తన ఇంటిలోనే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తాను కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నదీ... ఎప్పుడు చేరుతున్నదీ రేవంత్ ప్రకటించనున్నారు. తన అనుచరులు, ముఖ్య నేతల సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేయనున్నారు.
ఈరోజు మరికొందరు రాజీనామా.....
అయితే రేవంత్ వెంట పెద్ద సంఖ్యలో టీటీడీపీ నేతలు ఈరోజు పార్టీని వీడననున్నారు. ఆదివారమే కొందరు ముఖ్య నేతలు పార్టీని వీడారు. వేం నరేందర్ రెడ్డి టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి కూడా రాజీనామాలు చేశారు. ఈరోజు నల్లగొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు మరికొందరు రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా, మండల స్థాయి నేతలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలందరూ రేవంత్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రంగంలోకి దిగి పార్టీ నేతలందరితో మాట్లాడే ప్రయత్నించారు. పార్టీని వీడొద్దని వారికి నచ్చ జెప్పేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనట్లు తెలుస్తోంది.
- Tags
- రేవంత్ రెడ్డి

