రేవంత్ ఎలాఉండేవారు...ఎలా... అయిపోయారు?

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మంచి ఆదరణ లభించినా... తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నేతలు దూరం పెడుతున్నట్లున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పార్టీలో చురుగ్గా పాల్గొనడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా రేవంత్ తన రాకను వ్యతిరేకించే వారి కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ పలకరించి వచ్చారు. అందులో డీకే అరుణ, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతల ఇళ్లకు వెళ్లి మరీ వారి మద్దతు కోరి వచ్చారు. అయితే దీనిపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి అందరి ఇళ్లు తిరుగుతూ తమను పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు లాంటి నేతలను రేవంత్ కలవలేదు. దీంతో వీరు రేవంత్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ప్రెస్ మీట్ పెట్టాలన్నా.....
రేవంత్ రెడ్డి ఇటీవల ఎక్కువగా మౌనాన్నే పాటిస్తున్నారు. అయితే ప్రెస్ మీట్ పెట్టాలన్నా కాంగ్రెస్ నేతల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందట. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తన ఇష్టం వచ్చిన అంశంమీద... తన ఇష్టం వచ్చిన సమయంలో ప్రెస్ మీట్ పెట్టే రేవంత్ రెడ్డి ఇటీవల సన్ బర్న్ పార్టీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా అందుకు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు చివరకు పర్మిషన్ ఇచ్చినా... రేవంత్ ప్రెస్ మీట్ కు ఎందుకు అనుమతిచ్చారని గాంధీభవన్ సిబ్బందిపై సీనియర్ నేతలు మండిపడ్డారట. ఇలా రేవంత్ కాంగ్రెస్ లో కష్టాలు అనుభవిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే డిసెంబర్ 9వ తేదీ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభిస్తారా? లేదా? అన్న దానిపై కూడా స్పష్టత రాలేదు. రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతిచ్చిందని చెబుతున్నా... స్థానిక నేతలు మాత్రం వ్యక్తిగతంగా పాదయాత్రకు పార్టీ నిబంధనలు అంగీకరించవని చెబుతున్నారు. పాపం... రేవంత్... ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు....?
- Tags
- రేవంత్

