రేవంత్ ఈ సవాల్ స్వీకరిస్తారా?

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ తొలిసారి సవాల్ విసిరింది. దమ్ముంటే రాజీనామా చేయాలని కోరింది. రాజీనామా లేఖను అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇవ్వడం కాదని, నిజంగా రాజీనామా చేయాలని ఉంటే తెలంగాణ స్పీకర్ కు ఇవ్వాలని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి రేవంత్ రాజీనామా లేఖ ఎక్కడుందో తెలియడం లేదు. రాజీనామా చేశానని రేవంత్ చెబుతున్నారు. రాజీనామా లేఖ చంద్రబాబు వద్ద లేదని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. సన్ బర్న్ పార్టీకి ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ బావమరిది నేతృత్వంలోనే ఈ పార్టీ జరుగుతుందన్నారు. నగరంలో పబ్ ల్లో ఎక్కువ భాగం ఆయనవేనని రేవంత్ విమర్వించారు. కొలువుల కొట్లాటకు అనుమతించని ప్రభుత్వం ఇవాంకా వస్తున్నప్పటికీ సన్ బర్న్ కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
ఎదురుదాడికి దిగిన టీఆర్ఎస్....
దీనిపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా రేవంత్ తప్పించుకుని తిరుగుతున్నాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. రేవంత్ రాజీనామా అంతా ఒక డ్రామాగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఓటుకు నోటు కేసు ఇంకా వీగిపోలేదన్నారు. ఆ కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయాడని, ఆయన శిక్ష అనుభవించక తప్పదన్నారు. రేవంత్ రాజీనామాపై నిన్నటి వరకూ అధికార టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే రేవంత్ స్వరం పెంచడంతో అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. మరి రేవంత్ అధికార టీఆర్ఎస్ సవాల్ ను స్వీకరిస్తారా? రాజీనామా లేఖను స్పీకర్ కు పంపుతారా? అనేది చూడాల్సి ఉంది.
- Tags
- రేవంత్ రెడ్డి

