రేవంత్ ఈ పనిచేస్తే పరిస్థితి ఏంటి?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన సన్నిహితులతో సమావేశమై చర్చించారు కూడా. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానాలను కూడా రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. అయితే ఇప్పుడు తాను కూడా అదే చేస్తే ప్రజల్లో ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతింటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.... పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.
ఉప ఎన్నిక అనివార్యమా?
రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా? అన్నది కూడా సందేహమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటేనే కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రాజీనామా ఇచ్చిన వెంటనే దానిని ఆమోదించాలని కేసీఆర్ పై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వత్తిడి తెస్తారు. అయితే రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. మరి కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి మంచి పట్టుంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే అది సాధారణ ఎన్నికలపై పడుతుంది. అందుకనే రాజీనామా ఆమోదానికి కొంత సమయం తీసుకునే వాదన కూడా గులాబీ పార్టీలో విన్పిస్తోంది. ఒకవేళ కేసీఆర్ రాజీనామా ఆమోదించాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్నిక అనివార్యమవుతుంది. అందుకనే కొడంగల్ లోని టీడీపీ నేతలను టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. మొత్తం మీద రేవంత్ రాజీనామా చేస్తే మరో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండొచ్చు... ఉండకపోవచ్చు.
- Tags
- రేవంత్

