రేవంత్ ఆ ఇద్దరినే ఎందుకు టార్గెట్ చేశారంటే?

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో కలకలం బయలుదేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లడంతో ముఖ్య నేతలందరూ అమరావతిలో సమావేశమయ్యారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అయితే రేవంత్ ఏపీ టీడీపీ నేతలనే టార్గెట్ చేయడానికి కారణాలేంటన్న చర్చ జరిగింది. అందులోనూ ముఖ్యంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలపైనే ఎందుకు ఆరోపణలు చేశారన్నదానిపై తీవ్రంగా చర్చించారు. యనమల రామకృష్ణుడు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను తెలంగాణలో పొందడాన్ని రేవంత్ బయటపెట్టడం, పరిటాల సునీత కుటుంబానికి తెలంగాణలో బీర్ల ఫ్యాక్టరీకి లైసెన్సు ఇవ్వడం వంటి వాటిని రేవంత్ తప్పుపట్టడాన్ని చూస్తే రేవంత్ పార్టీని వీడటానికే సిద్ధమవుతున్నారు. మంత్రులు యనమల, పరిటాల సునీతకు పార్టీలో మంచి గౌరవం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మంచి ప్రయారిటీ ఇచ్చే నేతల్లోనూ వీరిద్దరూ ఉన్నారు. వారినే టార్గెట్ చేశారంటే ఇక రేవంత్ పార్టీలో ఉండరని తేలిపోయింది.
బాబుకు దగ్గరగా ఉండే మంత్రులనే.....
ఏపీ టీడీపీ మంత్రులను టార్గెట్ చేయడానికి మరో కారణం కేసీఆర్ ను కూడా ఇరకాటంలో పడేయడానికే నని సమాచారం. దశాబ్దాల పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు ఆంధ్రప్రదేశ్ కే చెందిన వారికి ఇస్తున్నారని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో సింహభాగం కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కాయి. ఈ విషయాన్ని ఇంతకు ముందు పీసీసీ నేతలు కావచ్చు.... టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కావచ్చు విమర్శించారు. కాని రేవంత్ తాజాగా బయటపెట్టడంతో కేసీఆర్ తెరవెనక టీడీపీ నేతలతో నడుపుతున్న నాటకాన్ని బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని దాదాపు ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందిన నేతలకు కాంట్రాక్టులు, లైసెన్సులు కేసీఆర్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని ప్రశ్నార్థకంలో పడేశారని ప్రజలను ఆలోచింప చేసేవిధంగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సంయమనం పాటించాలని చంద్రబాబు నేతలను కోరారు. చంద్రబాబు దేశంలో లేకపోవడం చూసే రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారంటున్నాయి టీడీపీ వర్గాలు. మొత్తం మీద దీపావళికి ముందుగానే రేవంత్ తెలుగుదేశంలో బాంబు పేల్చినట్లయింది. చంద్రబాబు విదేశాల నుంచి ఇచ్చే డైరెక్షన్ ను బట్టి టీడీపీ నేతలు ముందుకు పోవాలని నిర్ణయించారు. అప్పుడే రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలని నిశ్చయించారు.
- Tags
- పరిటాల సునీత
- యనమల

