రిలీఫ్ : త్వరలో 21 బ్యాంకులకు ఒకటే కార్డు

మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడే నాయకులు, పార్టీలు, వ్యవస్థలు మొత్తం ఇప్పుడు ఒకేసారి వ్యూహాత్మకంగా బాట మార్చాయి. ఇప్పుడు జనం కష్టాల గురించి మాట్లాడడం మానేశాయి. కష్టాలు అనేవి ఇప్పుడు లేవు అని వారు అనుకుంటున్నారో లేదా, కష్టాలు అలవాటు అయిపోయాయిలే అని నిశ్చితాభిప్రాయానికి వచ్చారో తెలియదు గానీ.. కష్టాల గురించి కాకుండా.. భవిష్యత్తు గురించి... అనగా, ఆన్లైన్ లావాదేవీల గురించి, కార్డు చెల్లింపుల గురించి, ఈ పోస్ యంత్రాల గురించి మాట్లాడుతున్నారు.
విశాఖపట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఓ కొత్త సంగతిని తెలియజేస్తున్నారు. త్వరలోనే 21 బ్యాంకులకు చెల్లుబాటు అయ్యేలా కొత్త కార్డు రాబోతున్నదని ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా ప్రతి బ్యాంకు కు మనం ఒక కార్డు వాడుతుండడం జరుగుతోంది. ఒక కార్డును మరో బ్యాంకు ఏటీఎంలో వాడితే.. పరిమిత సంఖ్య వినియోగం తర్వాత అదనపు రుసుములు పడడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం నోటు కష్టాల నేపథ్యంలో ఆ రుసుములను తగ్గించారు.
వెంకయ్యనాయుడు తాజాగా ఇలాంటి రుసుములకు అవకాశం కూడా లేకుండా 21 బ్యాంకులకు కలిపి ఒకటే కార్డును వాడుకలోకి తేవడం గురించి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఇలాంటి కార్డు వస్తుందని చెబుతున్నారు. ప్రజలు ఆన్ లైన్, మొబైల్ చెల్లింపులు అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇపోస్ విధానానికి ప్రజలు సహకరించాలని, ఇప్పటికే రైల్వేల్లో 58 శాతం ఈ విధానం అమలవుతోందని ఆయన సెలవిస్తున్నారు. ఇదంతా నిజమే గానీ.. ప్రజల ఆన్లైన్ లావాదేవీలకు రుసుములు, పన్నులు లేకుండా రద్దు చేస్తామనే మాట మాత్రం పాలకుల నోటినుంచి రావడం లేదు. అలా చార్జీలు రద్దుచేస్తే వినియోగం పెరుగుతుందని చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు పదేపదే ప్రతిపాదిస్తున్నా.. కేంద్రంనుంచి ఒక్కరూ ఆ దిశగా పెదవి విప్పలేదు.
నల్లధనం ఓ క్యాన్సర్ లాంటిదని, మోదీ దానికి చికిత్స చేస్తున్నారని తన సహజశైలిలో పొగడ్తలు లంకించుకుంటున్న వెంకయ్యనాయుడు ప్రజలు ఏం చేయాలో చెబుతున్నారు తప్ప.. ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకపోవడం విశేషం.

