రాహుల్ ప్రయోగం ఫలించిందే

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ శకం ప్రారంభమయిందనే చెప్పొచ్చు. ప్లీనరీలో ఆయన ప్రసంగం సీనియర్లకు దాదాపుగా అర్థమయిపోయంది. సీనియర్లు యువ నాయకులకు సలహాలు ఇవ్వాలని రాహుల్ చెప్పారు. అంటే సీనియర్లను తాను పక్కన పెట్టేయనున్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో యువరక్తం పొంగాలన్నది ఏఐసీసీ అధ్యక్షుడి భావన ప్లీనరీలో ఆయన స్పీచ్ లోనే అర్థమయిపోయింది. యువతకు పెద్దపీట వేయాలన్న తమ అధ్యక్షుడి అభిమతాన్ని సీనియర్లు అర్థం చేసుకుని వెంటనే చర్యలకు ఉప క్రమించారు.
ప్లీనరీలోనే చెప్పకనే చెప్పి....
రాహుల్ గాంధీ...ఇక కాంగ్రెస్ ను ఏలేది ఆయనే. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడు కాకముందే ఆయన కోటరీలోకి అనేక మంది యువనేతలు చేరిపోయారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువనేతలను గుర్తించి ఆయన తన దగ్గరకు చేర్చుకున్నారు. వారికి పార్టీలో పెద్ద పదవులేమీ లేకపోయినా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో యువనేతల హడావిడి ఎక్కువగా కన్పించింది. దీనికి తోడు ప్లీనరీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సీనియర్లను కొంత ఇబ్బందిపెట్టే విధంగా మారాయంటున్నారు. వయసుడిగిపోతున్నా ఇంకా పార్టీ పదవులు పట్టుకుని వేలాడమేంటన్న ప్రశ్న ఆయన మాటల్లోనే ధ్వనించింది.
రాహుల్ తప్పించక ముందే....
దీంతో సీనియర్లు వరుసగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం ప్రారంభించారు. తమంతట తాముగానే తప్పుకునే విధంగా రాహుల్ ప్లీనరీనిచక్కగా ఉపయోగించుకున్నారు. గతంలో దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్లను ఆయన పక్కనపెట్టారు. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల ఇన్ ఛార్జిగా ఉన్న డిగ్గీరాజాను తప్పించి కొత్తవారిని, తన కోటరీలో ఉన్న వారిని నియమించుకున్నారు.అంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారులో కూడా సీనియర్ల జోక్యం లేకుండా రాహుల్ ముందుజాగ్రత్త పడుతున్నారన్నమాట.
వచ్చే ఎన్నికలకు యువరక్తమే....
రాహుల్ ప్రసంగంతో తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గోవా కాంగ్రెస్ పార్టీ చీఫ్ శాంతారామ్ నాయక్ తెలిపారు. ఆయన ప్లీనరీ ముగిసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత గుజరాత్ పీసీసీ చీఫ్ భరత్ సింహ్ సోలంకి కూడా స్వచ్ఛందంగా రాజీనామ చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజబబ్బర్ పదవికి రాజీనామా చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో వయసుమీరిన కాంగ్రెస్ నేతలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేస్తుండటం విశేషం. అంటే రాహుల్ వేటు వేయకముందే వారంతట వారే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. మొత్తం మీద రాహల్ ప్రయోగం ఫలించిందంటున్నారు ఆయన కోటరీలోని యువనేతలు. 2019 ఎన్నికల నాటికి పార్టీలో అంతా యువరక్తమే ఉంటుందంటున్నారు.
- Tags
- రాహుల్ గాంధీ
