రాహుల్ తొలి విక్టరీ కొడతారా?

గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అయితే గుజరాత్ ను వదిలి రావడం లేదు. ఆయన గుజరాత్ ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. మరోవైపు కేంద్రమంత్రులు కూడా గుజరాత్ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ నాలుగుసార్లు గుజరాత్ ను పర్యటించి వచ్చారు. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ ను ఏలుతున్న కమలనాధులు ఈసారి కూడా గుజరాత్ గద్దెనెక్కాలని ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ కూడా కమలం కంచుకోటను బద్దలు కొట్టాలని శ్రమిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో కాంగ్రెస్ కొంత వరకూ సక్సెస్ అయిందనే చెప్పాలి.
కాంగ్రెస్ కు అనుకూల అంశాలు....
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లున్నాయి. తొలి విడత ఎన్నిక వచ్చే నెల తొమ్మిదో తేదీన జరగనుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో శక్తియుక్తులన్నింటినీ రెండు పార్టీలు కేంద్రీకరించాయి. ఈసారి పాటీదార్ అందోళన్ సమితి నేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ కు మద్దతిస్తుండటం కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. అలాగే దళిత నేత జిగ్నేశ్, బీసీ సమస్యల ఉద్యమనేత అల్ఫేష్ ఠాకూర్ల మద్దతు కూడా కాంగ్రెస్ కే లభించడంతో ఆ పార్టీ ఉత్సాంతో ఉంది. దీంతో కచ్, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పుంజుకున్నట్లయింది. అయితే మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్ లో మాత్రం కమలం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదంటున్నారు. రాహుల్ గాంధీ శ్రమ ఈసారి ఫలిస్తుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. అయితే సర్వేలు మాత్రం తక్కువ సీట్ల తేడాతోనయినా గుజారాత్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేలింది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో అప్పటికి పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతున్న రాహుల్ తొలి విక్టరీని గుజరాత్ లో కొట్టాలని తహతహలాడుతున్నారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికలు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతున్నాయి.

