రాహుల్ గణాలు ఇంకా తెరమీదికి రాలేదే!

జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్లీనరీ, వర్కింగ్ కమిటీ ... ఇలా ఏ కీలక సమావేశం జరుగుతున్నా సరే.. ‘‘ఈ దఫా రాహుల్ గాంధీకి పార్టీ సారథ్యం అప్పగించబోతున్నారు.’’ అనే డైలాగు గత రెండున్నరేళ్లుగా వినిపిస్తూనే ఉంది. పార్టీలో ఉండే రాహుల్ వర్గీయులైన మేధావి నాయకులు, పార్టీకి సంబంధించి విధాన నిర్ణ్ణయాలు చేసే స్థాయిలోనూ ఉన్నారు. వారంతా జాతీయ మీడియా ముందుకు వచ్చి.. రాహుల్కు త్వరలో పార్టీ పగ్గాలు అప్పగించడం జరుగుతుంది అని సెలవిస్తూ ఉంటారు. అంతే ఒక్కసారి ఒక్క చోట చిన్న లీక్ అయితే చాలు.. ఇక దేశవ్యాప్తంగా మీడియాసంస్థలు ఎవ్వరూ తమకు అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా సరే... ఎవ్వరితోనైనా చెక్ చేసుకోవాలనే ఆలోచనకూడా లేకుండా.. యువరాజుకు త్వరలో పట్టాభిషేకం అనే వార్తలను వండి వార్చేస్తాయి.
అయితే అలాంటి రాహుల్ సంబంధిత హడావిడి ఏమీ లేకుండానే ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దగ్గరకు వచ్చేసింది. ఈనెల 7వ తేదీన ఢిల్లీలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సోనియా దీనికి అధ్యక్షత వహిస్తారు.
సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా పార్టీ సారథ్య బాధ్యతలను కొడుకు చేతిలో పెట్టి తప్పుకోవాలని అనుకుంటున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాహుల్ తాలూకూ ఆయన కోటరీకి చెందిన కాంగ్రెస్ వంది మాగధులు అంతా రాహుల్ చేతికి పగ్గాలు రాగానే పార్టీ సంస్కరణ జరిగిపోతుందని.. ఇక ఏకబిగిన పార్టీ ప్రజల్లోకి దూసుకువెళ్తుందని, యువనాయకత్వానికి పెద్దపీట వేసేస్తారని, వృద్ధతారన్ని ఇంటికి పంపుతారని అంటూ ఉంటారు. మరి రాహుల్ మాత్రం ఇప్పటికీ.. పగ్గాలు చేతికి ఇస్తోంటే పుచ్చుకోరు. పార్టీకి పట్టిన ఖర్మ ఏంటంటే.. ఆయనకు తప్ప మరొకరికి ఇచ్చే ధైర్యం వారికి లేదు. ఈసారి వర్కింగ్ కమిటీ సమావేశం నేపథ్యంలో రాహుల్ అనుచర గణాలు ఇంకా యాక్టివేట్ అయినట్లు లేదు పాపం!

