రాహు కేతు క్షేత్రానికి వెల్లువలా ఆదాయం!

నోట్ల రద్దు పర్యవసానాల్లో ప్రధానంగా దేశంలోని దేవాలయాల్లో హుండీలకు డబ్బు వెల్లువలా వచ్చి పడుతుందని తెలుగుపోస్ట్ మోదీ నగదు రద్దు ప్రకటన చేసిన మరు రోజే అంచనావేసింది. కొన్ని రోజుల వరకు నల్ల ధనాన్ని రకరకాల లావాదేవీల ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నాలు సాగించిన కుబేరులు.. క్రమంగా ఆ ఆశలను పక్కన పెట్టి.. ముందు ఉన్న సొమ్మును వదిలించుకునే బాట పట్టినట్టున్నారు. సహజంగానే వారికి ఆలయాలు తొలి ఆప్షన్ గా కనిపించడం వింత కాదు. ఆ క్రమంలో భాగంగా.. దేశంలోనే ప్రఖ్యాత రాహుకేతు క్షేత్రంగా పేరుమోసిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి కూడా…... నిధులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
పోల్చిచూస్తే గత వస్తున్న భక్తుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ... హుండీ ద్వారా వస్తున్న ఆదాయం మాత్రం గణనీయంగా పెరగడం అనేది.. ఆసక్తికరం. ఆలయానికి 36 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
నోట్ల రద్దు ప్రకటించాక.. నవంబరు 9న 25006 మంది దర్శనం చేసుకోగా ఆర్జితసేవల ద్వారా 776510 రూపాయలు ఆలయానికి లభించాయి. అక్టోబరు 9న 35536 మంది దర్శనం చేసుకోగా, 22 లక్షల మేర ఆదాయం వచ్చింది. అక్టోబరు 9 నుంచి 29 వరకు 22 రోజుల్లో 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, 3.37 కోట్ల రూపాయల ఆర్జితసేవలు, ప్రసాదాల విక్రయం ద్వారా ఆదాయం లభించింది. అదే నవంబరు విషయానికి వస్తే.. భక్తుల సంఖ్య 5.90 లక్షల మందే. కార్తీకమాసం అనే అంశం పరిగణిస్తే భక్తుల సంఖ్య తగ్గినట్లు లెక్క. అయినప్పటికీ ఆదాయం మాత్రం పెరిగింది. 3.65 కోట్ల రాబడి వచ్చింది.
హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా అక్టోబరు కంటె నవంబరు లో ఎక్కువగా ఉంది. అక్టోబరు 27 న లెక్కింపు జరిపిన సమయానికి 83 లక్షల రాబడి రాగా, నవంబరు 16న హుండీ లెక్కింపులు చేసినప్పటికే ఆదాయం 87 లక్షలు దాటిపోయింది. నవంబరు 25న మరోమారు హుండీ తెరిచే సమయానికి మరో 32 లక్షలు వచ్చాయి. అంటే నవంబరులోనే 1.19 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లయింది. వీటిలో 500, 1000 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకరు వెయ్యినోట్ల కట్టను కూడా వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ ఒక్కచోటే కాదు..
నిజానికి ఇలా నవంబరు నెలలో ఆలయాల హుండీ ఆదాయం అమాంతం పెరగడం అనేది ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే కనిపిస్తున్న పరిణామం కాదు. దాదాపుగా ఆలయాలు ఉన్న ప్రతి చోటా ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి పుణ్య క్షేత్రాలు మాత్రమే కాకుండా పల్లెల్లో పట్టణాల్లో ఉండే చిన్న ఆలయాల్లో హుండీలు కూడా హఠాత్తుగా లక్షల రాబడిని కళ్లజూస్తున్నాయి. హఠాత్తుగా ఇలా సొమ్ము వదిలించుకోవడానికి హుండీలను ఒక మార్గంగా ఎంచుకుంటున్న వారికి పుణ్యం ఏమేరకు వస్తుందో గానీ.. దేవుళ్ల రాబడి పెరిగిందంటే అది ఖచ్చితంగా మోదీ పుణ్యమే అని చెప్పాలి.

